
ముగిసిన మాన్‌సూన్ పోలో చాంపియన్‌షిప్
శంకర్‌పల్లి: మండల పరిధిలోని జన్వాడ నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్‌లో మూడు రోజులుగా మాన్‌సూన్ పోలో చాంపియన్ షిప్–2025 పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో రాజస్థాన్ రంబుల్, హర్యానా హరికేన్, తెలంగాణ థండర్ తదితర జట్లు పాల్గొన్నాయి. ఆదివారం నిర్వహించిన ఫైనల్లో తెలంగాణ థండర్స్ తొమ్మిది గోల్స్ చేయగా.. హర్యానా హరికేన్ 11గోల్స్ చేసింది. దీంతో రెండు గోల్స్ తేడాతో హర్యానా హరికేన్ జట్టు చాంపియన్ షిప్–2025 కప్‌ని సొంతం చేసుకుంది. విజేత జట్టుకు తెలంగాణ–ఆంధ్ర సబ్ ఏరియా ఆఫీసర్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నవాబు రౌనక్ యార్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ సీఈఓ మీర్ హఫీజుద్ధీన్ మాట్లాడుతూ.. హార్స్ రైడింగ్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.