
డెకరేషన్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం
పహాడీషరీఫ్: డెకరేషన్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీలో వివాహాదిశుభకార్యాలకు వినియోగించే డెకరేషన్ సామగ్రి గోడౌన్ ఉంది. శనివారం సాయంత్రం పక్కనే ఉన్న చెత్తకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. డెకరేషన్ సామగ్రిలో ప్లాస్టిక్, ఫైబర్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జనావాసాల నడుమ ఉన్న ఈ గోడౌన్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.