
పేదల ఇళ్లు కూల్చేయొద్దు
పహాడీషరీఫ్: దశాబ్దాలుగా నివాసం ఉంటూ ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి డిమాండ్ చేశారు. జల్‌పల్లి మున్సిపల్ పరిధి ఎర్రకుంట సమీపంలోని షాహిన్‌నగర్ మర్కజ్, క్యూబా కాలనీవాసులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి ఇళ్లు కట్టుకొని 15–20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. దాదాపు 400 ఇళ్లను ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయంటూ కూల్చేందుకు మార్కింగ్ చేయడం తగదన్నారు. ప్రభుత్వం ఒక స్పష్టత అంటూ లేకుండా పాలన సాగిస్తోందని విమర్శించారు. పట్టణ ప్రాంత చెరువులు, గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా పేరుతో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వీధి వ్యాపారులను సైతం రోడ్డున పడేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.వెంకట్రాం, మాజీ చైర్మన్ అబ్దుల్లా సాది, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు బదర్ అలీ, హుస్సేనీ, సూరెడ్డి కృష్ణారెడ్డి, షర్ఫుద్దీన్ హామెద్, అలీ మన్సూరీ, పల్లపు శంకర్, హసన్ షా, దస్తగిర్, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి