
భూ రికార్డులు మార్చేలా చూడండి
ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్‌కు రైతుల వినతి
యాచారం: ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతుల భూ రికార్డులను తిరిగి రైతుల పేర్లపై నమోదు చేసేలా కృషి చేయాలని తాడిపర్తి గ్రామ రైతులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు విన్నవించారు. నగరంలో శనివారం ఆయనను కలిసిన వారు ఫార్మాసిటీ భూసేకరణ చట్ట వ్యతిరేకంగా జరిగిందని, అవార్డులు అన్నీ రద్దు చేయాలని, టీజీఐఐసీ పేరు మీదున్న భూ రికార్డులను రైతుల పేర్లపై నమోదు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. చట్ట విరుద్ధంగా ఫార్మాసిటీకి సేకరించిన భూములకు బలవంతంగా ఫెన్సింగ్ వేసి తమను వెళ్లకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన 2,211 ఎకరాల పట్టా భూమికి మరోచోట భూమి చూపించేలా సర్కార్‌పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ దూస రమేశ్, టీజీఎస్ రాష్ట్ర నాయకులు దార సత్యం, సామ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.