
నీటిని తరలిస్తున్న ట్యాంకర్ల సీజ్
శంకర్‌పల్లి: పంట పొలాల వద్ద బోర్ల నుంచి అక్రమంగా నీటిని నింపి ఇతర అవసరాలకు తరలిస్తున్న లారీలను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. శంకర్‌పల్లి తహసీల్దార్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జన్వాడలో కొంత మంది వ్యక్తులు వ్యవసాయ బోర్ల నుంచి వ్యవసాయేతర అవసరాల నిమిత్తం నీటిని ట్యాంకర్ల ద్వారా వాడుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్‌ఐ తేజ, ఇతర సిబ్బంది కలిసి జన్వాడ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ నీటిని నింపుకొంటున్న 6 ట్యాంకర్లను గుర్తించారు. ఆ వ్యవసాయ భూములకు సంబంఽధించిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నీటిని నిల్వ చేసేందుకు తవ్వించిన గుంతలను జేసీబీ సాయంతో కూల్చివేయించారు. అనంతరం సీజ్ చేసిన లారీలను మోకిల పోలీసులకు అప్పగించినట్లు తహసీల్దార్ తెలిపారు.