
యోగం
ఆరోగ్య ఆనంద
యోగాతో ఒత్తిళ్లకు చెక్
● రుగ్మతలకు దివ్య ఔషధం
● రోజంతా ఉల్లాసం.. ఉత్సాహం
● ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
షాద్‌నగర్: యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. మనస్సును, శరీరాన్ని సంపూర్ణంగా అదుపులో ఉంచే ఒక సాధనం.. యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పొందొచ్చు.. నిద్రానంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయొచ్చు.. యోగాసనాలు వేయడం ద్వారా ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.. దైనందిన జీవితంలో పని ఒత్తిడిని, అలసటను అధిగమించేందుకు యోగా ఔషధంగా పనిచేస్తుంది.. ప్రజల్లో రోజురోజుకూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయొచ్చు.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
సర్వరోగ నివారిణి
యోగా సాధన ద్వారా మనిషిలో ఉన్న సర్వరోగాలు మటుమాయం అవుతాయి. కండరాలకు కావాల్సిన శక్తి రావడంతో పాటు ద్రుఢంగా మారుతాయి. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. శారీరక, మానసిక ప్రశాంతత, మనో బలం, సంగ్రహణ శక్తి పెంపొందుతాయి. ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెంచుకోవచ్చు.
ఆసనాల్లో అనేక రకాలు
యోగాసనాల్లో చాలా రకాలు ఉన్నాయి. నిలబడి, కూర్చొని, పడుకొని చేసే ఆసనాలు ఉన్నాయి. వజ్రాసనం, అర్ధ ఉష్ట్రాసనం, శశాంకాసనం, ఉత్తానమండూకాసనం, వక్రాసనం, మకరాసనం, తడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, త్రికోణాసనం, భద్రాసనం, సరళభుజంగాసనం, పవన యుక్తాసనం, శలభాసనం, సేతు బంధానసం, ఉత్తానపాదాసనం, అర్ధహలాసనం, పవన ముక్తాసనం, శవాసనం ఇలా అనేక రకాలు ఉన్నాయి. ప్రాణాయామాలు కపాల భాతి, అనులోమ విలోమ, శీతలీ ప్రాణాయామం, బ్రమరీ ప్రాణాయామం, ధ్యానం ఉన్నాయి.
విస్తరిస్తున్న యోగా
యోగా క్రమక్రమంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. చాలా మంది యోగాసనాలు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంనేందుకు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయిస్తున్నారు. తెల్లవారుజాము మొదలు ఉదయం సూర్యకిరణాలు బాగా వచ్చేంత వరకు సాధన చేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో పతంజలి యోగా సమితి వారు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆశ్రమాల్లో చాలా మంది వయస్సుపై బడిన వారు ఉండటంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటారు. సమస్యను దూరం చేసుకునేందుకు యోగా సాధన చేస్తున్నారు.
రోగ నిరోధక శక్తి
నిత్యం యోగా చేయడం ద్వారా ఆర్యోగంగా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలి.
– శ్రీజారెడ్డి, యోగా శిక్షకురాలు, షాద్‌నగర్
ఒత్తిళ్లను అధిగమించొచ్చు
నిత్య యోగా సాధనతో మానసిక, శారీరక ఒత్తిళ్లను అధిగమించొచ్చు. అన్ని అవయవాలకు రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. అలసటను పూర్తిగా తగ్గిస్తుంది. రోగాలకు ఆస్కారం ఉండదు.
– పానుగంటి శశిధర్, పతంజలి యోగా సమితి వ్యవస్థాపకుడు, షాద్‌నగర్

యోగం

యోగం

యోగం