
ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం రైతులతో కలిసి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న రైతులంతా పేదకుటుంబాలకు చెందినవారని అన్నారు. ఈ భూములను గోశాల కోసం తీసుకుంటే రైతులకు ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడతామని.. అప్పటి వరకు గోశాల ఏర్పాటు పనులు చేపట్టొద్దని అన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, మాజీ సర్పంచ్ అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డికి చేవెళ్ల ఎమ్మెల్యే వినతి