
మున్సిపాలిటీల్లో ‘ఉపాధి’ ప్రారంభించాలి
షాద్‌నగర్: మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో పేదలకు కూలి పనులు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల సమస్యల సాధన, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వచ్చే నెల 5,6 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం ఫరూఖ్‌నగర్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములు, ప్రధాన కార్యదర్శిగా రాజు నాయక్, ఉపాధ్యక్షులుగా జంగయ్య, శంకర్, కార్యదర్శులుగా రాములుగౌడ్, చెన్నయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.