
రైతు భరోసాలో కత్తెర
ధారూరు: ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నగదుపై మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. పట్టా పాసు పుస్తకాల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే తక్కువగా భరోసా డబ్బులు తమ ఖాతాల్లో జమ అయ్యాయని గురువారం మండిపడ్డారు. అందులో మచ్చుకు.. తరిగోపుల గ్రామానికి చెందిన అల్లాడ రాంచంద్రారెడ్డికి 1.33 ఎకరాల పొలం ఉంటే కేవలం 29 గుంటలకే రైతు భరోసా డబ్బులు వచ్చాయి. రూ.10,950కి బదులుగా రూ.4,350 ఖాతాలో జమ అయ్యాయని వాపోయాడు. అంతా పంట పొలమే అయినా మొత్తం డబ్బులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తే.. ప్రభుత్వం చేయించిన ఆన్‌లైన్ సర్వే ప్రకారం నగదు జమ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. అదే గ్రామానికి చెందిన ఆనంద్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు సైతం భూమి ఎక్కువ ఉంటే డబ్బులు సగానికి సగం తగ్గించి వేశారని లబోదిబోమంటున్నారు.
సగానికి సగం భూమి తగ్గించి రైతుల ఖాతాలో నగదు జమ
లబోదిబోమంటున్న అన్నదాతలు
వెంటనే జమ చేయాలి
పట్టా పాసుపుస్తకాల్లో ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు భరోసా నగదు జమ చేయాలి. సాగు చేసిన పొలానికి సైతం పెట్టుబడి సాయం అందక పోవడం బాధాకరం. రైతు భరోసాలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం. శాసనసభ స్పీకర్ ఈ విషయంలో తగిన చొరవ తీసుకుని పొలం ఉన్నంత మేర డబ్బులు వేయించాలి.
– జైపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు