
కసాయి కొడుకుకు కటకటాలు
కందుకూరు: కన్నతండ్రినే అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో కొడుకును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పసుపుల చిన్న జంగయ్య, పద్మమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరందరికి వివాహాలు చేశారు. గ్రామంలో ఉన్న అర ఎకరం పొలం దున్నుకుంటూ మరోపక్క గొర్రెలు మేపుకొంటూ జీవిస్తున్నారు. కాగా కొడుకు శేఖర్ తన భార్య పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉండేవాడు. ఏడాది క్రితం పాత ఇల్లు కూల్చివేసి కొత్తగా ఇంటిని నిర్మించే క్రమంలో భార్య పిల్లలతో కలిసి వేరే చోటుకి మారాడు. పిల్లర్లు, స్లాబ్ మాత్రమే వేసి ఆగిన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. రాత్రిపూట తల్లి గ్రామంలో ఉండే చిన్న కుమార్తె ఇంటికి వెళ్లి నిద్రించేది. కాగా డబ్బులు లేక నిర్మాణం మధ్యలో ఆగడంతో ఉన్న అర ఎకరం పొలం అమ్మి ఇల్లు పూర్తి చేయాలని కొడుకు తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. పెద్దలు పంచాయితీ పెట్టి చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కాగా రెండు రోజుల క్రితం భార్య పిల్లలు పుట్టింటికి వెళ్లారు. దీంతో 17న రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి శేఖర్ నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే భోజనం చేశాడు. అనంతరం కొడుకు అద్దె ఇంటికి, తల్లి చిన్న కుమార్తె వద్దకు నిద్రించడానికి వెళ్లగా, చిన్నజంగయ్య అక్కడే నిద్రించాడు. ఇదే అదునుగా చూసుకుని అర్ధరాత్రి శేఖర్ తండ్రి వద్దకు వచ్చి బండరాయితో పాటు కర్రతో మోది హతమార్చిన ఘటన విదితమే. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.
కన్న తండ్రిని హతమార్చిన కేసులో రిమాండ్