
కొత్త కలెక్టర్.. పెట్టండి నజర్!
ఇదీ పరిస్థితి
● హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు 16 మండలాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం వరకు ల్యాండ్ బ్యాంక్‌లో 1,138 పార్శిల్స్ ఉండగా ప్రస్తుతం వాటి 1075 పార్శిల్స్‌కు చేరినట్లు అధికార గణాంకలు స్పష్టం చేస్తున్నా.. వాస్తవ పరిస్థితిలో పార్శిల్స్ మరింత తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద 890 ల్యాండ్ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఉంది. మిగతా పార్శిల్స్‌లో సుమారు 11,45,334.95 చదరుపు గజాల విసీర్ణం గల ఖాళీ స్ధలం ఆక్రమితకు గురైనట్లు తెలుస్తోంది. సుమారు 169 పార్శిల్స్‌లోని దాదాపు 11,93,595.12 చదరపు గజాల విస్తీర్ణ గల ఖాళీ స్థలంతోపాటు 445098.64 చదరపు గజాల ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉనట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భూమి బంగారమే. గజం స్థలం విలువ తులం బంగారానికి కంటే అధికమే. ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగం ఉదాసీన వైఖరి, క్షేత్రస్థాయిలో తహసీల్ అధికారులు, సిబ్బంది అండదండలతో ప్రభుత్వ ఖాళీ స్థలాలు కనుమరుగవుతూనే ఉన్నాయి. నగరంలో రెవెన్యూ అంటే ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ప్రధానంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ.. కంచే చేను మేసిన విధంగా రెవెన్యూ యంత్రాంగం పనితీరు తయారైంది. ఇటీవల కొత్తగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన యువ ఐఏఎస్ అధికారిణి హరిచందన దాసరి.. సర్కారు స్థలాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరముందని నగర పౌరులు ఆశిస్తున్నారు. అందరి మాదిరిగానే కేవలం సమావేశాలు, ఆదేశాలకు పరిమితమైతే మాత్రం.. సర్కారు స్థలాల పరిరక్షణ హుళక్కే అన్న చందంగా మారుతుంది. కబ్జాదారులపై ఆమె కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది.
ప్రభుత్వ భూముల్లో పాగా..
నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు దర్జాగా పాగా వేస్తున్నారు. ప్రభుత్వ స్థలం అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. వాటిని సైతం తొలగిస్తూ దర్జాగా తొలగించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలాలపై నిర్మాణాలు వెలసిన తర్వాత ఫిర్యాదులు, ఒత్తిళ్లు వస్తే గానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించక పోవడం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్కారు స్థలాల్లో వెలుస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించేలోపు.. అవి కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం సర్వసాధారణంగా తయారైంది. ఇలా కోర్టు కేసుల్లో చిక్కుకున్న వందల కోట్ల రూపాయల విలువైన భూములపై సమగ్ర ఆధారాలు, వాదనలు లేక ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గడం షరామాములుగా మారింది. కొన్ని కేసులకు ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు కాని పరిస్థితి కూడా లేకపోలేదన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. రెవెన్యూ యంత్రాంగం వద్ద స్థలాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లేని కారణంగా క్రమంగా అక్రమ కట్టడాలు సక్రమ కట్టడాల జాబితాలో చేరిపోతున్నాయి.
కలెక్టర్లు మారినప్పుడల్లా..
జిల్లా కలెక్టర్ మారి కొత్త వచ్చినవారు సర్కారు స్థలాలపై దృష్టి సారించడం.. పరిరక్షణకు పలు చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే తయారవుతోంది. ఆరేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ యాప్ రూపకల్పన చేసి ప్రభుత్వ స్థలాలకు కంచె, సైన్ బోర్డుల ఏర్పాటు, ఆన్‌లైన్ మానిటింగ్, ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో భద్రపర్చడం లాంటి చర్యలు చేపట్టారు. వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించి ప్రతిరోజూ భూములపై పర్యవేక్షణతో పాటు పక్షం రోజులకోసారి తనిఖీ చేసి తగిన సమాచారాన్ని సంబంధిత తహసీల్దార్, భూ పరిరక్షణ అధికారులకు అందించేలా కసరత్తు చేశారు.
● యోగితా రాణా బదిలీ తర్వాత ల్యాండ్ బ్యాంక్ యాప్ అమలు మూలకుపడింది. ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ల్యాండ్ బ్యాంక్ యాప్‌ను పునరుద్ధరించి భూముల వివరాల అప్‌డేట్ ప్రక్రియతో పాటు రక్షణ కోసం చర్యలకు ఉపక్రమించినా.. ఆచరణలో ముందుకు సాగలేదు.
ప్రభుత్వ జాగాల్లో అక్రమార్కుల పాగా
గ్రేటర్‌లో మాయమవుతున్న ఖాళీ స్థలాలు
సైన్ బోర్డులు పెట్టినా
మూణ్నాళ్ల ముచ్చటే..
కబ్జాదారులకు క్షేత్రస్థాయిలో
అండదండలు
రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం
కఠినంగా వ్యవహరించాలని
హరిచందనకు పౌరుల వినతి