
ఆదరణ తగ్గుతున్న ‘గ్రామీణాభివృద్ధి’
ఏజీవర్సిటీ: 1980 దశకం వరకు చేసిన ప్రయత్నాలతో పోలిస్తే కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి అనే అంశం ఆదరణ కోల్పోతోందని ఎన్‌ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్రకుమార్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీ)లో ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా మూడు సంస్థలు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్(సీఐఆర్‌డీఏపీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్), రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ సొసైటీ(ఆర్‌ఈఈడీఎస్)లు పాల్గొన్నాయి. ఆయన మాట్లాడుతూ జూలై 6న ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి విధానాలు, కార్యక్రమాలను పంచుకోవడానికి రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గ్రామీణ వర్గాలతో ముఖాముఖి చర్చలు జరుపుతున్నారన్నారు. ప్రొఫెసర్ అనిల్ కె.గుప్తా పన్ని మాట్లాడుతూ అభివృద్ధి పటంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ మోడల్ ఈ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఐటీ రంగంలో పట్టణ స్టార్టప్‌లకు కేటాయించిన రిస్క్ క్యాపిటల్ మాదిరిగానే గ్రామీణ స్టార్టప్‌లకు సమానమైన మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా, వియత్నాం, లవోపీడీఆర్, మయన్మార్, థాయిలాండ్, పీజీ, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, భారతదేశం వంటి 11 సీఐఆర్‌డీఏపీ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.