
మూత్రశాలలు శుభ్రం చేసిన విద్యార్థులు
ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, తల్లిదండ్రులు
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిఽధిలోని నేరళ్లచెరువు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు విద్యార్థులతో మూత్రశాలలను శుభ్రం చేయించారు. దీనిపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు చెప్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే చిన్నారులతో మూత్రశాలలను శుభ్రం చేయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో స్వీపర్ చేయాల్సిన పనులను పిల్లలతో చేయిస్తున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉపాధ్యాయులపై మండిపడుతున్నారు. చిన్నారులు మూత్రశాలలను శుభ్రం చేస్తున్న సమయంలో గ్రామస్తులు వీడియో తీశారు. చిన్నారులతో ఎందుకు చేయిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయులను ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని బుకాయించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.