
ఎప్పటికో పరిష్కార ‘మార్గం’!
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఎప్పుడు ఏచోట ప్రమాదం జరుగుతుందో.. ఎవరి ప్రాణాలు గాలిలో కలుస్తాయో తెలియడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తరచూ రాకపోకలు సాగించడం, స్థానికులు వస్తూ పోతుండడంతో ఈ రోడ్డు రద్దీగా మారింది. మహానగరం నుంచి ఉద్యోగ, వ్యాపారరీత్యా నిత్యం యాచారం, మాడ్గుల్, కడ్తాల్, ఆమన్‌గల్లు మండలాల ప్రజలే కాకుండా నల్లగొండ జిల్లా దేవరకొండ, మర్రిగూడ, పల్లెపల్లి, చింతపల్లి, మిర్యాలగూడ తదితర మండలాల నుంచి వేలాది మంది ప్రయాణికులు కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలపై రాకపోకలు సాగిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు రవాణా సాగిస్తుంటాయి. సాగర్‌రోడ్డు సమీపంలోని యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లోని కొన్ని గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో కలపడంతో ఈ రోడ్డుపై వీఐపీల రాకపోకలు అధికమయ్యాయి.
ప్రతిపాదనలు సిద్ధం చేసినా..
సాగర్‌రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం హెచ్‌ఎండీఏ, రోడ్డు భవనాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని అధికారుల బృందం విస్తరణపై ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాదారుల అభిప్రాయాలు సైతం సేకరించింది. 99 శాతం మందికి పైగా నాలుగు లేన్లుగా విస్తరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ గేట్ నుంచి మాల్ సమీపంలోని తమ్మలోనిగూడ గేట్ వరకు 23 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా విస్తరించడానికి నిర్ణయించారు. ప్రస్తుతం పది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డును 17 మీటర్లకు విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మధ్యలో డివైడర్, పాదచారుల ప్రయాణ సౌకర్యార్థం విస్తరణ చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ నిర్ణయించింది. తర్వాత సర్కార్ దృష్టి సారించకపోవడంతో విస్తరణకు గ్రహణం పట్టింది.
ఆరునెలల వ్యవధిలోనే..
ఆరు నెలల వ్యవధిలోనే ఖానాపూర్ గేట్ నుంచి మాల్ గ్రామాల మధ్య జరిగిన ప్రమాదాల్లో పది మందికిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 25 మందికి పైగా తీవ్ర గాయాలతో క్షతగాత్రులుగా మిగిలారు. తాజాగా యాచారంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు, చింతపట్ల గేట్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యధికంగా గునుగల్ గేట్ సమీపంలోని ఓ డెయిరీ, ఆగాపల్లి స్టోన్ క్రషర్, యాచారంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో, గునుగల్ అటవీ ప్రాంతం, యాచారం పోలీస్ స్టేషన్ సమీపంలో, చింతపట్ల, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి గేట్ల వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి విస్తరణ చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
సాగర్‌రోడ్డుపై వాహనాల రద్దీ
తరచూ ప్రమాదాలు
గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు
విస్తరణకు నోచుకోని రహదారి
నిధులు మంజూరు కాగానే..
నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు మొదలుపెడుతాం.
– రవీందర్‌గౌడ్, రోడ్డు భవనాల శాఖ డీఈఈ, ఇబ్రహీంపట్నం డివిజన్
అవగాహన కల్పిస్తున్నాం
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం పీఎస్‌ల పరిధిలో తరచూ వాహనాల తనిఖీలు చేపట్టి నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. అతి వేగం ప్రమాదకరమని సూచిస్తున్నాం. జరిమానాలు సైతం విధిస్తున్నాం. రోడ్డు విస్తరణ జరిగితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.
– కేపీవీ రాజు, ఏసీపీ ఇబ్రహీంపట్నం

ఎప్పటికో పరిష్కార ‘మార్గం’!

ఎప్పటికో పరిష్కార ‘మార్గం’!