
గురుకుల విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల పూర్వ విద్యార్థులకు వృతి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017 నుంచి కమ్మదనం గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించి ఇప్పటి వరకు ఉద్యోగం లేని విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతి ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు తెలిపారు. 19–25 ఏళ్ల మధ్య వయసు కలిగిన గురుకుల పూర్వ విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు వెంటనే కమ్మదనం గురుకుల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
షాద్‌నగర్‌ః కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎఫ్‌సీ) చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. మైనార్టీ మహిళా శక్తి పథకంలో భాగంగా పట్టణంలోని మండల పరిషత్ సమావేశశ మందిరంలో మంగళవారం 258 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పేద మహిళలను ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోందని, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్, రఘు నాయక్, కొంకళ్ల చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జమృద్‌ఖాన్, సర్వర్‌పాషా, ఇబ్రహీం, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయ శాఖ తూర్పు విభాగ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం 60 రోజులకు గాను రూ.11,77,715 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరాబ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
సాగులో సేంద్రియ
పద్ధతులు మేలు
మొయినాబాద్: రైతులు పంటల సాగులో సేంద్రియ పద్ధతులు అవలంబించి అధిక లాభాలు పొందొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్థాస్ జానయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్నషాపూర్‌లో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగు పద్ధతులు, భూసారం పెంపు, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. తద్వారా భూమిలో భూసారం పెరిగి నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కూరగాయ పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, మల్చింగ్ పేపర్ వాడుకోవడం ద్వారా నీటి వృథాను తగ్గించి కలుపు నివారించుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, శాస్త్రవేత్తలు నీలిమ, రేవతి, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ

గురుకుల విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ