
ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య
షాద్‌నగర్‌రూరల్: ప్రస్తుతం దేశంలో మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య ఆరోపించారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ముఖ్యకూడలిలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసులను అత్యంత పాశవికంగా హతమార్చడం దారుణమని అన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను పోలీసులే కాల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలు జీవించే హక్కులను కూడా హరిస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు, ఆదివాసులపై హత్యాకాండను వెంటనే విరమించుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసి, గిరిజన కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు, బీఆర్‌ఎస్ నాయకుడు రాజావరప్రసాద్, బీఎస్పీ నాయకుడు దొడ్డి శ్రీనివాస్, సీపీఎం నాయకుడు ఈశ్వర్‌నాయక్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.