
కారులోకి దూసుకెళ్లిన క్రాష్ బారియర్
● ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ● అక్కడికక్కడే బెంగాల్‌వాసి మృతి ● గంటల తరబడి శ్రమించి మృతదేహం వెలికితీత
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్‌రోడ్డుపైఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లిన ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్‌కేసర్ మండలం నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్ సప్లయ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం అజాగ్రత్తగా వాహనం నడుపుతూ క్రాష్ బారియర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లింది. క్రాష్ బారియర్‌లోనే కారు ఉండిపోయింది. ప్రమాదంలో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్‌బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలిసులకు కష్టతరం అయ్యింది. ఔటర్‌రింగ్‌రోడ్డు సిబ్బందిని పిలిపించి కారు పైభాగం కట్ చేయించారు. గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కారులోకి దూసుకెళ్లిన క్రాష్ బారియర్