గోడు వినండి.. గూడు కల్పించండి
దివ్యాంగ దంపతుల వేడుకోలు
ఇబ్రహీంపట్నం రూరల్: నడవలేని స్థితిలో కలెక్టరేట్‌కు వచ్చిన వీరు చంపాపేట్‌లో నివసించే రొండి నాగమ్మ, నాగేష్. దంపతులు ఇద్దరూ దివ్యాంగులే. పీజీ వరకు చదువుకున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. ప్రస్తుతం పనులు చేయలేక ఇంట్లోనే ఉంటున్నారు. అద్దె ఇంట్లో కిరాయి సైతం చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలమైన, దివ్యాంగులమైన తమకు ప్రభుత్వ పథకం కింద ఇల్లు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేకమార్లు విన్నవించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆపసోపాలు పడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా రు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చారు. కలెక్టర్ కలవకపోవడంతో అధికారులకు అర్జీ సమర్పించారు. ఈ నెల 6న కూడా ప్రజావాణిలో మొరపెట్టుకున్నామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నగరం నుంచి ఇంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉందని.. జీవనోపాధికరువై, బతుకుభారమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ గోడు పట్టించుకుని ఉండటానికి ఎక్కడైనా కాస్త గూడు కల్పించి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.


