
భవనాల్లేక ఇబ్బందులు
దౌల్తాబాద్: మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేక కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ కొనసాగుతుంది. స్వశక్తి సంఘాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సొంత భవనాలు లేవు. ప్రతి నెలా గ్రామాల్లోని చెట్లు, సంఘం సభ్యుల నివాసాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో అతివలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేదికలు కరువు
మండలంలో 33 గ్రామపంచాయతీల్లో 46 గ్రామ సమాఖ్య సంఘాలున్నాయి. ఇందులో సుమారు 806 స్వయం సహాయక సంఘాలు ఉండగా 8,300 మంది సభ్యులు ఉన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకుంటూనే పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో కార్యాలయాలు లేక మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల మంజూరు, వసూళ్లు, సభ్యుల్లో చైతన్యం పెంపొందించడంలో కీలకపాత్ర పోషించే గ్రామ సంఘాలకు సరైన వేదికలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు.
వెంటాడుతున్న సమస్యలు
సొంత భవనాలు లేక సంఘాల కార్యకలాపాల నిర్వహణతో పాటు మహిళా సమాఖ్యలు, మహిళా పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, శిక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామైక్య సంఘాల వద్దకు వివిధ పనుల కోసం వచ్చిపోయే మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులకు పల్లెల్లో మౌలిక వసతులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ కోసం మండల కేంద్రంలో ఇందిరాక్రాంతి పథం పేరిట సొంత భవనం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సంఘ భవనాలు నిర్మిస్తే సంఘాల నిర్వహణలో తలెత్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పుడైన మహిళలకు సొంత భవనాలు నిర్మిస్తారని మహిళలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
కార్యకలాపాల నిర్వహణకు ఎదురవుతున్న ఇక్కట్లు
తీవ్ర అవస్థల్లో మహిళా సంఘాల ప్రతినిధులు
ఉన్నతాధికారులకు నివేదించాం
స్వయం సహాయక సంఘాల నిర్వహణ కోసం సొంత భవనాల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారులకు వివరించాం. మండలంలో భవనాలు కావాలని ప్రతిపాదనలు కూడా పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే నూతన నిర్మాణాలు చేపడుతారు.
– హరినారాయణ, ఇన్‌చార్జి ఏపీఎం, దౌల్తాబాద్