
ఎల్‌ఆర్‌ఎస్@255 కోట్లు
తుర్కయంజాల్: అక్రమ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు విశేష స్పందన లభించింది. ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించడంతో దరఖాస్తు దారులు చాలా మంది రుసుం చెల్లించారు. తొలుత మార్చి 31 వరకు రాయితీతో కూడిన గడువు ప్రకటించినప్పటికీ.. తరువాత మరో నెల, అనంతరం మే 3వ తేది వరకు అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీ స్థలాల యజమానులు ముందుకు రావడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.
2,55,923 దరఖాస్తులు
జిల్లాలోని 14 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల పరిధి నుంచి 2020 సంవత్సరంలో 2లక్షల 55వేల 923 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో లక్షా 78వేల 591 దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని అధికారులు ఆన్‌లైన్ ద్వారా సమాచారం అందజేశారు. దీంతో 65వేల 186 మంది రుసుం చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి రూ.255 కోట్ల 56 లక్షల ఆదాయం వచ్చింది. అత్యధిక దరఖాస్తులు తుర్కయంజాల్ నుంచి 54,331 వచ్చినప్పటికీ, ఆదాయం మాత్రం పెద్ద అంబర్‌పేట నుంచి రూ.53 కోట్ల 85 లక్షలు వచ్చింది. బడంగ్‌పేట కార్పొరేషన్ నుంచి రూ.48 కోట్ల 45లక్షలు వచ్చాయి. అత్యల్పంగా శంషాబాద్ మున్సిపాలిటీలో 10,086 అర్జీలు వచ్చినప్పటికీ 111జీఓ పరిధిలో ఉండటంతో కేవలం 270 మందిని మాత్రమే అర్హులుగా పేర్కొంటూ రుసుం చెల్లించాలని సూచించారు. ఇందులో 151 మంది రూ.ఒక కోటి 59 లక్షలు చెల్లించారు.
మరో అవకాశం కల్పిస్తే..
ప్రభుత్వం రాయితీ ప్రకటించిన నాటి నుంచి ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు భారీగా ప్రచారం చేశారు. ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించారు. సులభంగా అర్థమయ్యేలా మొబైల్‌లో ఫైల్ స్టేటస్ చెక్ చేసుకోవడంతో పాటు, డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో చాలా మంది రుసం చెల్లించారు. ప్రభుత్వం గడువు మరింత పెంచి, రాయితీ కల్పిస్తే మరికొందరు ఫీజు చెల్లించే అవకాశాలు ఉన్నాయి.
క్రమబద్ధీకరణకు విశేష స్పందన
ముగిసిన రాయితీ గడువు
ప్రొిసీడింగ్స్‌కు వేచి ఉండాల్సిందే
పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో భారీగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ.. వీటి పరిశీలనకు వేచి చూడక తప్పని పరిస్థితి. వారం క్రితం వరకు దరఖాస్తులను కేవలం టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రూవల్ చేస్తే సరిపోయేది. కానీ తిరిగి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అంగీకారం కూడా కావాల్సి ఉంది. దీంతో అత్యధికంగా ఫీజులు చెల్లించిన చోట ఇబ్బందులు తప్పేలా లేవు. మూడు శాఖల అధికారులు ధ్రువీకరించి, ఆమోదం తెలిపితే ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ పొందవచ్చు.