
‘ఎర్లీబర్డ్’కు స్పందన కరువు
షాద్‌నగర్: మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఎలాంటి బకాయిలు లేని వారు ముందస్తుగా మొత్తం పన్ను చెల్లిస్తే అందులో ఐదు శాతం రాయితీని కల్పిస్తోంది. కానీ ముందస్తు చెల్లింపులకు ఇళ్ల యజమానుల నుంచి స్పందన అంతంతమాత్రమే వచ్చింది.
షాద్‌నగర్‌లో రూ.1.94 కోట్ల వసూలు
షాద్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డుల్లో సుమారు 70వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. 15,933 గృహ, వ్యాపార సముదాయాల నుంచి సుమారుగా రూ.7.22 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 27శాతం రూ.1.94 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.
కొత్తూరులోనూ అంతంతే..
కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 13,200 జనాభా ఉంది. 2,619 ఇళ్లు, వ్యాపార సముదాయాలున్నాయి. వీటి నుంచి రూ.2.56 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఎర్లీ బర్డ్ పథకంలో అధికారులు ఇప్పటి వరకు సుమారు 14శాతంతో రూ.54 లక్షలు వసూలు చేయగలిగారు.
ప్రచారం నిర్వహించినా స్పందన కరువు
ఎర్లీ బర్డ్ పథకం పై అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక బృందాలుగా అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అగాహన కల్పించారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాలకు మైకులను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆశించిన మేర పన్నులు వసూలు కాలేదు. ప్రభుత్వం విధించిన గడువును ప్రజలు పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేసుకోలేదు.
రాయితీ గడువు పెంపు
ఎర్లీ బర్డ్ పథకానికి ఏప్రిల్ 30తో గడువు ముగిసింది. అయితే ప్రభుత్వం ఈ గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదు శాతం రాయితీ ప్రకటించినా ముందుకు రాని మున్సిపల్ వాసులు
షాద్‌నగర్‌లో 27 శాతం, కొత్తూరులో 14 శాతం చెల్లింపులు
ఈ నెల 7వ తేదీ వరకు గడువు పెంపు
సద్వినియోగం చేసుకోవాలి
ఎర్లీబర్డ్ పథకానికి ఈ నెల 7వరకు గడువు పొడిగించారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
– బాలాజీ, కమిషనర్,
కొత్తూరు మున్సిపాలిటీ

‘ఎర్లీబర్డ్’కు స్పందన కరువు