
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వం, యాజమాన్యం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే సమ్మెకు దిగుతామని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూని యన్ (టీజేఎంయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య హెచ్చరించారు. పట్టణంలోని డిపో ఆవరణలో శుక్రవారం టీజేఎంయూ ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాములయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఏడు నెలలుగా జేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతులు ఇచ్చినా ఫలితం లేదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేసి గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించి కొత్త అలవెన్సులు అమలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి సిబ్బందిపై అధిక పనిభారం తగ్గించాలని, ఎంటీ డబ్ల్యూ యాక్టు అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రస్తుతం కన్సాలిడేటెడ్ పే కింద పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరా రు. 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తి వేయాలన్నారు. పీఎఫ్, సీసీఎస్ నుంచి యాజమాన్యం వాడుకున్న డబ్బులను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలన్నారు. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఈనెల 7 నుంచి సమ్మెకు దిగుతామని వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నర్సింలు, ధన్‌సింగ్, టీవీ రెడ్డి, స్వామి, మల్లయ్య, పర్వతాలు, శ్యామల, ఆంజనేయులు, టాకేశ్వర్‌రావు పాల్గొన్నారు.
టీజేఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య