‘భట్టి’కి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

‘భట్టి’కి ఘన స్వాగతం

Published Sat, Jan 27 2024 5:50 AM | Last Updated on Sat, Jan 27 2024 7:36 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను గజమాలతో సత్కరిస్తున్న పార్టీ నాయకులు - Sakshi

షాబాద్‌: మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు శుక్రవారం స్థానిక నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ ఆధ్వర్యంలో క్రేన్‌తో గజ మాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చందనవెల్లి భూ బాధితులతో మాట్లాడారు. గ్రామంలోని సర్వే నంబర్‌ 190లో భూ సేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఎంజాయ్‌మెంట్‌ సర్వే పేరిట భూమిలేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని.. గతంలో తాను ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా బాధితులు తన దృష్టికి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రావాల్సిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి, వాస్తవాలు బయటికి తీసుకువస్తామన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం ప్రజల్లోనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పామెన భార్గవ్‌రామ్‌, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు పెంటారెడ్డి, మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement