
చలి మంట కాచుకుంటున్న ప్రజలు
పది రోజులుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు
తేదీ ఉష్ణోగ్రత
1 15.3
2 14.0
3 16.2
4 17.1
5 19.4
6 19.4
7 18.3
8 13.1
9 13.5
10 12.8
● రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● పెరుగుతున్న చలి తీవ్రత ● కప్పేస్తున్న పొగమంచు
● ఉదయాన్నే బయటికి వెళ్లేందుకు జంకుతున్న జనం
చేవెళ్ల: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. జిల్లాలో చలి తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. ఉదయం 8 గంటల వరకు రోడ్లపై జనం, వాహనాలు కనిపించడం లేదు. పొగమంచుతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వారం రోజులుగా చలిగాలులు వీస్తుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. చలి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. చలి మంటలు వేయడం, స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించడం చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలవుతుండటంతో త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారస్తులు సైతం త్వరగా దుకాణాలు మూసివేసి ఇళ్లకు చేరుకుంటున్నారు. పని ఉంటే తప్ప బయటికి రావటం లేదు. వాహనదారులు ఉదయం, సాయంత్రం సమయాల్లో వచ్చే పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయన్నే పనుల్లోకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులు, పాల వ్యాపారులు, మార్నింగ్ వాక్ చేసేవారు కాస్త ఆలస్యంగా బయటకు వస్తున్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చలికాలంలో ప్రజలకు కావాల్సిన స్వెట్టర్లు, వెచ్చగా ఉండే దుప్పట్లు అమ్మే దుకాణాలు వెలుస్తున్నాయి.
జాగ్రత్త అంటున్న వైద్యనిపుణులు
ఇప్పటికే జలుబు, దగ్గు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఇప్పుడు చలి తోడవడంతో ఆస్పత్రులకు బాధితుల సంఖ్య పెరిగింది. చలికాలంలో ఎక్కువగా చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. చలి నుంచి వీలైనంతవరకు దూరంగా ఉండాలంటున్నారు. చలికాలంలో దద్దుర్లు, చర్మం పగుళ్లు వస్తాయని ఎక్కువగా నీరు తీసుకోవాలని.. ఆస్తమా ఉన్నవారు చలిగాలులకు మరింత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వేకువజామునే బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి చర్మాన్ని పూర్తిగా కప్పుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సరైన పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు.