
ఏపీ సీఎం జగన్‌తో స్వామి నారాయణ గురుకుల విద్యాలయాల స్వామీజీలు
మొయినాబాద్ రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో స్వామి నారాయణ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణకు చెందిన ఆ విద్యాలయాల స్వామీజీలు, ట్రస్ట్ సభ్యులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ స్వామి నారాయణ గురుకుల విద్యాలయాల స్వామీజీలు, ట్రస్ట్ సభ్యులు ఏపీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతిలో గురుకులాల ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు వారు తెలిపారు. స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొయినాబాద్ మండలం కనకమామిడి సమీపంలో స్వామి నారాయణ గురుకుల యూనివర్సిటీ ఏర్పాటుకు వంద ఎకరాలు కేటాయించేందుకు సన్నాహాలు జరిగినట్లు జగన్‌మోహన్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. వైఎస్ అకాల మరణంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో 52కు పైగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నట్లు జగన్‌కు వివరించినట్లు తెలిపారు. ఏపీలో గురుకులాల ఏర్పాటుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతితో పాటు పులివెందులలో గురుకులాలు ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం జగన్ సూచించినట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుకువల్లభ్ స్వామి, స్వారూప్ స్వామి, శ్రావణ్ ప్రియ స్వామి, విశ్వన్ స్వామి, మంత్రి స్వరూప్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్‌ను కోరిన హిమాయత్‌నగర్‌స్వామి నారాయణ గురుకుల విద్యాలయ స్వామీజీలు
విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఏర్పాటుకు సానుకూలం