జిల్లాలో నిత్యం ఇం‘ధన’ భారం రూ.15లక్షలు
డీజిల్‌పై లీటరుకు రూ.3.27..
పెట్రోల్‌పై లీటరుకు రూ.3.39 పెంపు
సిరిసిల్ల: వాహనదారులపై పెట్రోల్, డీజిల్ పిడుగుపడింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే అమలులోకి రావడంతో శుక్రవారం నుంచే ఇం‘ధన’ భారం పడింది. జిల్లాలోని వాహనదారులపై నిత్యం రూ.15 లక్షల మేరకు అదనపు భారం పడుతుంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
నిత్యం రూ.15 లక్షల భారం
జిల్లా వ్యాప్తంగా అన్ని కంపెనీల పెట్రోల్‌బంకులు 78 వరకు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్‌ను వినియోగించే వాహనాలు 1,65,505 వరకు ఉన్నాయి. నిత్యం 3.50 లక్షల లీటర్ల డీజిల్, 1.05లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన పెరిగిన ధరలతో నిత్యం వాహనదారులపై రూ.15లక్షలు అంటే నెలకు రూ.4.50 కోట్ల భారం పడనుంది.
తరచూ బంక్‌ల బంద్ !
జిల్లాలో చాలా బంకుల్లో డీజిల్ ఉంటే పెట్రోల్ ఉండదు.. పెట్రోల్ ఉంటే డీజిల్ ఉండని పరిస్థితి నెలకొంది. గతంలో ఇంధన కంపెనీలు అరువు(ఉద్దెర)పై డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లను పంపించేవి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంధన సమస్యలు తలెత్తడంతో ముందుగా డీడీలు తీసి పంపించిన బంకులకే డీజిల్, పెట్రోల్‌ను పంపుతున్నాయి. అయితే జిల్లాలో ఉద్దెర వ్యాపారం చేసిన పెట్రోల్ బంకుల యజమానులకు భారీ వాహనదారులు రూ.లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంది. వారి నుంచి సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఇంధన కంపెనీలకు డీడీలు చెల్లించేందుకు నగదు లేక సకాలంలో ట్యాంకర్లు రావడం లేదు.
అన్ని రంగాలపై ప్రభావం
డీజిల్, పెట్రోల్ ధరల పెంపు అన్ని రంగాలపై పడనుంది. వ్యవసాయం నుంచి రవాణారంగంతోపాటు కూరగాయలు, వ్యాపార, వాణిజ్యరంగాలపై పెట్రోల్ పిడుగు పడుతుంది. ప్రధానంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. పొలాలు దున్నడం, వరి కోతలు, పొలాలకు పెండను తరలించడం, కొత్తగా వ్యవసాయ భూములను చదును చేయడం, మట్టి కొట్టుకోవడం వంటి పనులకు ఇంధన వినియోగం ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇలా..(లీటరుకు)
ఇంధనం మొన్నటి వరకు ఇప్పుడు తేడా
పెట్రోల్ రూ.108.04 రూ.111.43 రూ.3.39
స్పీడ్ పెట్రోల్ రూ.117.79 రూ.121.18 రూ.3.39
డీజిల్ రూ.96.23 రూ.99.50 రూ.3.27


