● మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ
సిరిసిల్లటౌన్: పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. మూడో వార్డులో శుక్రవారం సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో సమస్యను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్‌రావుతో మాట్లాడి నిధులను అందించారన్నారు. ఆ నిధులకు అదనంగా రూ.3 లక్షలు మున్సిపల్ నిధులను కేటాయించినట్లు తెలిపారు. కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్, డీఈ పి.వాణి, పంచాయతీరాజ్ ఏఈ అజారుద్దీన్ పాల్గొన్నారు.
కోటి సూర్య నమస్కారాలకు రండి
సిరిసిల్లటౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కోటి సూర్య నమస్కారాల కార్యక్రమానికి రావాలని కోరుతూ డీఎంహెచ్‌వో రజితకు తపోవన యోగా కేంద్రం ఇన్‌చార్జి ఎలిగేటి కృష్ణ ఆహ్వానపత్రి అందజేశారు. జూన్ 21న లక్ష మందితో 27 సార్లు సూర్య నమస్కారాలు చేసి ‘కోటి సూర్య నమస్కారాలు’ కార్యక్రమంలో పాల్గొనాలని డీఎంహెచ్‌వోతోపాటు డీఎస్పీ నాగేంద్రచారిని ఆహ్వానించారు. ఈ గిన్నిస్‌బుక్ రికార్డు ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు తపోవన యోగ కేంద్రంలో నిత్యం ఉదయం 5:30 నుంచి 7:30 వరకు ‘ఉచిత యోగా శిక్షణ శిబిరం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 99633 38212లో సంప్రదించాలని కోరారు.
దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు
సిరిసిల్ల: సమగ్ర శిక్ష, అలీంకో సంయుక్తంగా గురువారం సుందరయ్యనగర్ భవిత కేంద్రం, పాఠశాలలోని దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో జగన్మోహన్‌రెడ్డి హాజరై ఎంపికై న విద్యార్థులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కాలిపర్స్, బ్రెయిలీ కిట్లు అందించారు. 14 మంది సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు అందజేశారు. దృష్టిలోపం ఉన్నా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో పాసైన రుద్రవరం హైస్కూల్ విద్యార్థిని గొట్టెముక్కల పల్లవిని అభినందించారు.
కొనుగోళ్లు వేగవంతం చేయండి
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. మండలంలోని రహీంఖాన్‌పేట ఏఎంసీ గోదాం, తాళ్లపల్లి రైస్‌మిల్లు, పొత్తూరు ప్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. తాళ్లపల్లి రైస్‌మిల్లులో స్టోరేజ్ దగ్గర పడుతుందని యాజమాన్యం అడిషనల్ కలెక్టర్‌కు తెలపగా మరికొంత ధాన్యం దించుకోవాలని సూచించారు. పొత్తూరు కొనుగోలు కేంద్రంలో లారీలను పంపాలని రైతులు కోరగా పంపిస్తానని, స్థానికంగా ఉన్న ట్రాక్టర్లను ఉపయోగించు కోవాలని సూచించారు. ఇల్లంతకుంట తహసీల్దార్ సురేష్, ఏపీఎం కుమారస్వామి, ఆర్‌ఐ సంతోష్ ఉన్నారు.
బస్తాలను మిల్లులకు తరలించాలి
ఎల్లారెడ్డిపేట/బోయినపల్లి: తూకం వేసిన ధా న్యం బస్తాలను వెంటవెంటనే మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బోయినపల్లి మండలం కొదురుపాక, మాన్వాడల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరి శీలించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న గోదాములను వినియోగించుకోవాలని తెలిపారు. తహసీల్దార్లు సుజాత, షరీఫ్‌మొయినొద్దీన్ ఉన్నారు.


