ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లైబ్రరీలో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమతున్న అభ్యర్థులు వార్త పత్రికలు చదవాలని సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంప్యూటర్ శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, రెడ్డినాయక్ పాల్గొన్నారు.
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణకు శ్రీకారం
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా స్టడీ సర్కిల్ ఆవరణలో మొక్క నాటారు. ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామని, అభ్యర్థులు అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో సంప్రదించాలన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి, స్టడీసర్కిల్ హానరరీ డైరెక్టర్ మల్లేశం పాల్గొన్నారు.
అపెరల్ పార్క్ గోదాములు పరిశీలన
ధాన్యం నిల్వ చేస్తున్న అపెరల్ పార్క్‌లోని గోదాములను కలెక్టర్ పరిశీలించారు. హమాలీలకు మంచినీరు, భోజనం వసతి కల్పించాలని ఆదేశించారు. ధాన్యం అన్‌లోడింగ్ వేగంగా చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్‌వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నర్సింహ, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసీల్దార్ మహేశ్ ఉన్నారు.


