వేములవాడఅర్బన్: ఓటర్ల నమోదులో అఖిలపక్షం పార్టీలు భాగస్వాములు కావాలని ఆర్డీవో కేఎస్‌బీ కుమారి కోరారు. వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌లో గురువారం అఖిలపక్షం నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల పక్షాన నియోజకవర్గంలో బూతుకు ఒక్కరి చొప్పున ఏజెంట్‌ను నియమించుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా కూడ ప్రతీ బూతుకు ఒక్కరిని బూత్ లెవల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. అనంతరం అఖిలపక్షం నాయకులు ఆర్డీవోకు రాజన్న చిత్రపటం, ప్రసాదం అందజేశారు. నిత్యానందారావు, పొలాస నరేందర్, పిన్నింటి హన్మండ్లు, తదితరులు ఉన్నారు.
సర్కారు బడిలో మెరుగైన విద్య
సిరిసిల్లటౌన్: సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. స్థానిక మూడోవార్డులో గురువారం నిర్వహించిన బడిబాటలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి పాల్గొన్నారు.
జాగ్రత్తగా ఉండాలి
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆదేశించారు. చందుర్తి, రుద్రంగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం పరిశీలించారు. వడదెబ్బకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డీడీఎం కార్తీక్, చందుర్తి వైద్యాధికారి వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.
ధాన్యం త్వరగా తరలించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్ కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. లారీల కొరత లేకుండా వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సంఖ్యను పెంచాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట, కొత్తపల్లిలోని రైస్‌మిల్లులను గురువారం తనిఖీ చేశారు. తహసీల్దార్ మారుతీరెడ్డి, సిబ్బంది ఉన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలు
సిరిసిల్ల: జిల్లాలో 2026–2027 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల(నాన్ రెసిడెన్షియల్)లో 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి గురువారం తెలిపారు. 46 మంది ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ స్కూళ్లులో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు కలెక్టరేట్‌లోని ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.


