అన్నదాత అరిగోస | - | Sakshi
Sakshi News home page

అన్నదాత అరిగోస

May 14 2026 10:47 AM | Updated on May 14 2026 10:47 AM

అన్‌లోడింగ్‌కు హమాలీల కొరత

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు

50 రోజులుగా కాంటాల కోసం ఎదురుచూపులు

లారీల కొరతతో పెట్టని తూకం

మిల్లుల్లో అన్‌లోడింగ్‌ సమస్య

హమాలీల కొరతతో రైతులకు తిప్పలు

రహీంఖాన్‌పేట గోదాం వద్ద అన్‌లోడింగ్‌ కోసం వేచి ఉన్న ట్రాక్టర్లు

కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం

చందుర్తి(వేములవవాడ): మద్దతు ధర దక్కుతుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ తూకం వేయకపోవడంతో రోజులకొద్దీ ఎదురుచూస్తున్నారు. ఒక్కో రైతు 50 రోజులు గడుస్తున్నా తమ ధాన్యం తూకం వేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల టన్నుల ధాన్యం సేకరించునున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు సగం కూడా సేకరించలేదు. లారీల కొరతతో కేంద్రాలకు రెండు, మూడు రోజులకో లారీ తరలిస్తున్నారు. ధాన్యాన్ని ముందస్తుగా కాంటాలు వేస్తే బరువు తగ్గి కోత విధిస్తుండడంతో నిర్వాహకులు కాంటాలు పెట్టలేకపోతున్నారు.

అధికంగా ధాన్యం తూకం

కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టి నాలుగు రోజులు గడిచిన తర్వాత మిల్లులకు తరలిస్తున్నారు. అయితే ఎండల తీవ్రతకు బస్తాల్లోని ధాన్యం బరువు తగ్గుతుండడంతో తమకు నష్టం వస్తుందని మిల్లర్లు ధాన్యం దింపుకోవడం లేదు. దీంతో బస్తాకు 41.600 కిలోలకు బదులు 42.600 కిలోలు తూకం వేస్తున్నారు.

వానాకాలం సాగుకు పెట్టుబడి కరువు

యాసంగి పంట అమ్ముడుపోకపోగా.. వానాకాలం సాగుకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఈక్రమంలో ధాన్యం అమ్ముడుపోక పంటల సాగు పెట్టుబడికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. రైతుభరోసా అందించినా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే దుస్థితి ఉండేది కాదని అన్నదాతలు వాపోతున్నారు. వర్షాలు పడితే ధాన్యం మొలకెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. గత వానాకాలంలో చందుర్తి మండలం రామన్నపేట, తిమ్మాపూర్‌, నర్సింగపూర్‌, చందుర్తి, మల్యాల గ్రామాల్లో ధాన్యం మొలకెత్తి రైతులు ఇబ్బంది పడ్డారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ధాన్యంతో వచ్చిన లారీలు, ట్రాక్టర్లు రోజులకొద్దీ గోదాంలు, మిల్లుల్లోనే ఎదురుచూస్తున్నాయి. హమాలీలు లేక ధాన్యం దింపడం ఇబ్బందిగా మారింది. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి, చింతలకుంటపల్లి, రహీంఖాన్‌పేట గోదాంలకు మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నారు. రహీంఖాన్‌పేట గోదాం వద్ద బుధవారం 60కి పైగా ట్రాక్టర్లు, 3 డీసీఎం వాహనాల వడ్ల బస్తాలతో వచ్చి ఉన్నాయి. రెండు రోజులుగా అక్కడే ఉంటున్నాయి. బుధవారం ఉదయం తహసీల్దార్‌ సురేశ్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ ఎలగందుల ప్రసాద్‌, రహీంఖాన్‌పేట గోదాం వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. గోదాం వద్ద హమాలీలు ఎవరూ లేకపోవడంతో జిల్లా అధికారులతో మాట్లాడి బుధవారం మధ్యాహ్నం వరకు రప్పించారు. గోదాంల వద్ద ఎలాంటి వసతులు లేకపోవడంతో పర్మినెంట్‌గా హమాలీలు ఉండడం లేదు. అంతేకాకుండా రహీంఖాన్‌పేట గోదాం వద్ద వే బ్రిడ్జి లేకపోవడంతో ధాన్యం లోడింగ్‌తో వెళ్లిన ట్రాక్టర్‌ యజమానులు ప్రైవేట్‌ మిల్లు వద్ద తూకం వేయిస్తున్నారు. వే బ్రిడ్జి రూ.100 వసూలు చేస్తున్నారని ఓ రైతు తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా వే బ్రిడ్జి రుసుం వసూలు చేయొద్దని ప్రైవేట్‌ మిల్లు వారికి చెప్పినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement