● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ముస్తాబాద్(సిరిసిల్ల): చట్టం తన పని తాను చేసుకుని పోతుందని.. బండి సంజయ్‌కి చట్టంపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ముస్తాబాద్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ వాస్తవాలు చెప్పి చట్టానికి సహకరించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా క్లియర్‌గా విచారణ జరగాలన్నారని స్పష్టం చేశారు. భావోద్వేగంతో సెంటిమెంట్‌ను రంగరించేలా ప్రసంగాలు చేయడం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే నీట్ రద్దు
బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతోనే నీట్ రద్దయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మూడు సార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పేపర్ కూడా లీకై ందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్1, 2లను విజయవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, పార్లమెంట్ కోకన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, కొండం రాజిరెడ్డి, రాంరెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీను, రాజేశం, ఆంజనేయులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
వేములవాడఅర్బన్/చందుర్తి: వేములవాడతోపాటు మండలంలోని చీర్లవంచ, గుర్రంవానిపల్లి, చందుర్తి మండలం ఎన్గల్ గ్రామాల్లో బుధవా రం నిర్వహించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. గుర్రంవానిపల్లిలో బస్‌షెల్టర్ ప్రారంభించారు. చందుర్తి మండలం ఎన్గల్ నుంచి మేడిపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో కనిపించిన ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్లను ఆపి వారితో మాట్లాడారు. ఏ మిల్లుకు తరలిస్తున్నారో తెలుసుకొని సదరు మిల్లు యజమానితో మాట్లాడి త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
పాఠశాలలు సమాజానికి బలమైన పునాదులు
పాఠశాలలు సమాజానికి బలమైన పునాదులు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లిలో బుధవారం నియోజకవర్గస్థాయి సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లకు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఈవో జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కౌన్సిలర్లు కాశ శ్రీనివాస్, వాసాల లావణ్య పాల్గొన్నారు.


