● పశువుల అక్రమ రవాణాపై నిఘా ● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల/తంగళ్లపల్లి: జిల్లా సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద బుధవారం రాత్రి చెక్‌పోస్టును ఎస్పీ మహేశ్ బీ గీతే, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బక్రీద్ నేపథ్యంలో జిల్లాలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గోవులు, దూడలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ పశువుల రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
బక్రీద్‌కు పటిష్ట భద్రత చర్యలు
బక్రీద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. గోవుల అక్రమ రవాణా, గోవధ వంటి చర్యలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. సంతల్లో కొనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశు వైద్యాధికారులచే జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, రవాణా అనుమతి పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. పత్రాలు లేకుండా పశువులను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టులు వద్ద ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలని ఆదేశించారు. గోవులను రవాణా చేస్తున్నారనే పేరుతో కొందరు వ్యక్తులు, సంఘాలు అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, సీఐ రవి, డీటీవో లక్ష్మణ్, పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


