నీటిని మళ్లించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కళ్ల ఎదుటే పంట పంటలు ఎండుతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు. చిప్పలపల్లిలో యాసంగిలో దాదాపు 900 ఎకరాలలో వరిపంట సాగుచేశారు. భూగర్భ జలాలు అడిగంటి పోవడంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎత్తిపోయాయి. ఇప్పటికే దాదాపు 400 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది.
చిప్పలపల్లికి శాపం
చిప్పలపల్లికి ఎలాంటి నీటి ఆధారం లేదు. ఎగువమానేరు ప్రాజెక్టు కెనాల్ చిప్పలపల్లిలో లేదు. చిప్పలపల్లి గ్రామ సరిహద్దు నుంచి ఎగువమానేరు కెనాల్ వెళ్తున్నా ఈ పొలాలకు చుక్క నీరు కూడా వినియోగించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు బోరుబావులనే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కో రైతు మూడు నుంచి ఐదు బోర్లు వేసి పంటలు సాగు చేస్తున్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు కెనాల్ చిప్పలపల్లికి మళ్లించాలని గ్రామస్తులు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మల్లన్నసాగర్ కెనాల్ సైతం నామాపూర్ వరకు ఉండడంతో చిప్పలపల్లి పంట పొలాలకు రావడం లేదు. మల్లన్నసాగర్ జలాలు వస్తాయన్న ఆశ చిప్పలపల్లి రైతుల్లో ఉండగా, అది కూడా నెరవేరలేదు. చిప్పలపల్లిలో కేవలం ఒక ఊర చెరువు ఉన్నప్పటికీ అది వర్షాధారమే. మానేరు ప్రాజెక్టు లేదా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కెనాల్ నీటిని చిప్పలపల్లికి మళ్లిస్తే పుష్కలమైన పంటలు పండుతాయి.
చిప్పలపల్లికి ఎలాంటి నీటి వసతి లేదు. యాసంగిలో బోర్లు ఎండిపోయి, చుక్క నీరు లేదు. మల్లన్నసాగర్, ఎగువ మానేరు ప్రాజెక్టు కెనాల్స్ చిప్పలపల్లి వరకు వేయాలి. సాగు, తాగునీటిని అందించాలి.
– మాచెట్టి లచ్చయ్య, సర్పంచ్, చిప్పలపల్లి


