వరదకాలువ.. వరప్రదాయిని
మూడెకరాల్లో వరి.. రెండెకరాల్లో కాకర
రెండు సీజన్లలో వరి
● రెండు జిల్లాలు.. మూడు మండలాలు ● రైతులకు కలిసొస్తున్న వరదకాలువ నీరు ● ఎస్సారెస్పీ నుంచి 122 కి.మీ. మేర పొడవు నీరు
బోయినపల్లి(చొప్పదండి): వరదకాలువ ఆధారంగా పంటలు సాగుచేస్తున్న రైతులకు కాలువనీరు జీవం పోస్తోంది. కాలువ ఆధారంగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లోని విలాసాగర్, మర్లపేట, దేశాయిపల్లి, రత్నంపేట, వరదవెల్లి, కొండన్నపల్లి, కురిక్యాల, ఆచంపల్లి, షానగర్ గ్రామాల రైతులు దాదాపు 2 వేలకు పైగా ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరదకాలువ నుంచి పైపులైన్లు వేసుకుని మోటార్ల ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు. కొద్ది నెలలుగా వరదకాలువలో నీరు సమృద్ధిగా ఉంటోంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు వరిసాగు చేశారు. వరద కాలువ 1.7 టీఎంసీ నీటి స్టోరేజీ సామర్థ్యంతో ఉంటుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యూలేటరీ వరకు 122 కిలోమీటర్ల మేర వరదకాలువ విస్తరించి ఉంది.
ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ జీరో పాయింట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీ దుగా రాజన్నసిరిసిల్ల జిల్లా వరదవెల్లి క్రాస్ రెగ్యూలేటరీ వరకు 122 కిలోమీటర్ వరకు వరదకాల్వ నిర్మించారు. వరదకాలువ పూర్తిగా నిండితే దాదాపు 18 మీటర్ల లోతు వరకు నీరు ఉంటుంది. ప్రస్తుతం ఆరు మీటర్ల మేర లోతులో నీరు ఉందని రైతులు చెబుతున్నారు. వరదకాలువ అడుగు భాగాన 43 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఎస్సారెస్పీ జీరో పాయింట్ నుంచి 28 కి.మీ వరకు ఒక డివిజన్, 28 నుంచి 44 కి.మీ వరకు రెండో డివిజన్, 44 నుంచి 73 కి.మీ వరకు మూడో డివిజన్, 73 నుంచి 102 కి.మీ వరకు నాలుగో డివిజన్, 102 నుంచి 122 కి.మీ వరకు ఐదో డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఐదు డివజన్ల పరిధిలో వరద కాలువను ఐదుగురు ఈఈలు, ఇద్దరు ఎస్‌ఈలు పర్యవేక్షిస్తారు.
ఎస్సారెస్పీ.. ఎల్లంపల్లి నీరు
ఎస్సారెస్పీ ద్వారా విడుదల చేసిన నీరు వరదకాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి వెళ్తుంది. మొదట ఎస్సారెస్పీ నుంచే వరదకాలువకు నీరు విడుదల చేసేవారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు సైతం విడుదల చేస్తున్నారు. ఇలా విడుదలైన నీరు వరదకాలువలో స్టోరేజీగా ఉంటూ పంటలకు ఉపయోగపడుతుంది. గత వానాకాలం సీజన్‌లో ఎస్సారెస్పీ నుంచి వరదకాలువకు నీరు విడుదల చేశారు.
వరదకాలువ
రైతులు వేసిన వరి పంట
దేశాయిపల్లి వరదకాలువ నుంచి చేనులోకి కిలోమీటర్ మేర పైప్‌లైన్ వేసుకున్నాను. కాలువ ఆధారంగా మూడు ఎకరాల్లో వరి, మరో రెండు ఎకరాల మేర కాకర సాగుచేస్తున్నాను. గత వానాకాలం సీజన్‌లో వరి పంట సాగుచేశాను. దివంగత నేత వైఎస్సార్ పుణ్యంతో కాలువ నీరు ఆధారంగా ఎంతో మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. – గోపు బాపురెడ్డి, దేశాయిపల్లి, రైతు
వరదకాలువ నీరు ఆధారంగా వానాకాలం, యాసంగి సీజన్లలో వరి సాగు చేస్తున్నాను. ఇప్పుడు యాసంగిలో ఐదు ఎకరాల మేర వరి వేసిన. కాలువ నుంచి వరి చేనులోకి సుమారు 500 మీటర్ల మేర పైప్‌లైన్ వేసుకున్నాను. గత వానాకాలం సీజన్‌లో సుమారు 120 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది.
– గంగాధర సురేందర్, విలాసాగర్, రైతు
వరదకాలువ.. వరప్రదాయిని
వరదకాలువ.. వరప్రదాయిని
వరదకాలువ.. వరప్రదాయిని


