ఇంత అన్యాయమా..
సిరిసిల్లటౌన్: ఇంత అన్యాయం చేస్తారా.. అసలు రాజ్యం ఎటుపోతుంది..మోసం చేయడమే అధిష్టానం పద్ధతా అంటూ సిరిసిల్ల బీఆర్‌ఎస్‌కు చెందిన 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సజావుగా సాగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ప్రమాణ స్వీకారానికి ముందు వైస్‌చైర్మన్‌కు సంబంధించిన పేరు సీల్డ్ కవర్ మార్చి ఇతరులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కేటీఆర్ మీకు అంతా మంచే జరుగుతుందని చెప్పి పంపించగా.. ఇక్కడకు వచ్చినాక నా పేరు స్థానంలో ఇంకొకరి పేరును మార్చుతారా అంటూ విమర్శించారు. అధిష్టానం నిర్ణయమే ప్రకటించడం జరిగిందని బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు, చైర్‌పర్సన్ భర్త జిందం చక్రపాణి వారించగా మోసం చేయడమే అధిష్టానమా..గత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితులు ఎదురయ్యాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత అన్యాయం చేయడం సరికాదన్నారు. కులాలు, మతాల పిచ్చి వదులుకుని పదవులు అందించాలని సూచించారు. ఈ విషయంలో తాను తీవ్రంగా మనస్థాపం చెందినట్లు వివరించారు. కేటీఆర్ నిర్ణయం ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పాలకవర్గం కొలువుదీరిన నేపథ్యంలో బుర్ర నారాయణగౌడ్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.


