ఓట్ల జగడం!
పోలింగ్ కేంద్రాల్లో నేతల వాగ్వాదాలు, లాఠీచార్జ్‌లు
కరీంనగర్‌లో దొంగ ఓట్లంటూ కలకలం
జగిత్యాలలో దొంగ ఓటరు పట్టివేత
రామగుండంలో ఓటరు లిస్టుపై రగడ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 58వ డివిజన్ జిల్లా పరిషత్ పోలింగ్‌బూత్‌లో బీఆర్‌ఎస్ నేతలు తమఓట్లు వేశారంటూ బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇది లాఠీచార్జ్‌కు దారి తీసింది. 32వ డివిజన్‌లో ఎంఐఎం, బీఆర్‌ఎస్ అభ్యర్థుల వర్గీయులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 33వ డివిజన్‌లో దొంగ ఓట్లు పడ్డయని ప్రచారం జరిగినా.. దాన్ని మున్సిపల్ కమిషనర్ ఖండించారు. 28 డివిజన్‌లో తమ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 49వ డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్ లాక్కుని బీజేపీ నాయకులు పగులగొట్టారని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి భర్త ఎన్నం ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 36వ డివిజన్‌లో పోలీసులతో స్వతంత్ర అభ్యర్థి యాదయ్య వాగ్వాదానికి దిగారు. 27 డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బంధువు అయిన పోలీసు తమపై చేయి చేసుకున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆరోపించాడు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అభ్యర్థి రజని కష్ణమూర్తి ఫొటోల గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పు పంపిణీ చేశారంటూ బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, మనోహర్‌రెడ్డి అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎనిమిదోకాలనీ 17వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఓటింగ్ లిస్టు బయటికి వచ్చిందని బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు.
జగిత్యాల జిల్లా
జగిత్యాలలోని 31వ వార్డులో ఎంఐఎం బీఆర్‌ఎస్ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. 26వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన బాపురపు చంద్రశేఖర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో 12వ వార్డులో ఓ అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు. జగిత్యాల 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల 2వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒకరినొకరు తోసుకున్నారు. కోరుట్లలో 27 వార్డులో స్వతంత్ర అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన ఆపిల్ పండ్లు పంచుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వేములవాడ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓ ఎస్సై సపోర్టు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మారం కుమార్ సతీమణి పోలింగ్ ఏజెంట్‌గా మరో వ్యక్తి ఐడీ కార్డు మెడలో వేసుకుని ఓట్లు అడిగినట్లు కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు.


