ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి మంగళవారం దిశానిర్దేశం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా బందోబస్తు నిర్వహించాలన్నారు. ముస్తాబాద్, నామాపూర్, పోతుగల్ గ్రామాల్లో కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా వుండాలని, సెల్‌ఫోన్లు అనుమతించవద్దన్నారు. ఫలితాలు ప్రకటించే వరకు సోషల్ మీడియాలో ప్రచారంపై నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్‌గౌడ్, మొగిలి, ఎస్సైలు రాహుల్‌రెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


