పనులు పూర్తయ్యేదెప్పుడో?
మానేరు ప్రాజెక్టు స్వరూపం
మొదలైన యాసంగి సాగు
కొనసాగుతున్న కాల్వ పనులు
పెండింగ్‌లోనే కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు
మానేరు నీటి సరఫరాకు ఆటంకాలు
ఐదు రోజుల్లో తైబందీ నిర్ణయం
ఈ చిత్రం ముస్తాబాద్ మండలంలోని ఎగువమానేరు ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి కాల్వ. మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోవడంతో ఇలా పచ్చగా కనిపిస్తుంది. నామాపూర్ నుంచి తెర్లుమద్ది వరకు ఇలా గుర్రపుడెక్క, తుంగతో నిండిపోవడంతో చుక్కనీరు పారే పరిస్థితి లేదు. తైబందీ అమలు చేసే సమయంలో కాల్వ ఇలా ఉంటే పొలాలకు నీరు ఎలా వచ్చేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎగువ మానేరు ప్రాజెక్టు మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయిని. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న ఎగువ మానేరు ప్రాజెక్టు కాల్వలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ.. ప్రాజెక్టు కుడి, ఎడమ కెనాల్స్‌పై చేపట్టిన మరమ్మతు పనులు పూర్తి కాలేదు. కెనాల్స్‌లో పేరుకుపోయిన తుంగ, గుర్రపుడెక్కతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కింద 17వేల ఎకరాల ఆయకట్టు తైబందీకి సమయం ఆసన్నమవుతుండడంతో సాగునీటి సరఫరా సజావుగా సాగుతుందా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి.
వారం రోజుల్లో తైబందీ
ఎగువ మానేరు ప్రాజెక్టు తైబందీకి నీటి పారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 22న తైబందీ.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ఆయకట్టు సాగుకు నీటిని విడుదల చేసే విషయంపై తీర్మానం చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు సైతం విధుల్లో ఉండడంతో తైబందీకి జాప్యమవుతోంది. దీంతోపాటు కెనాల్స్ మరమ్మతు పనులలో జాప్యం జరుగుతోంది.
జరుగుతున్న పనులు..
ముస్తాబాద్ మండలం నామాపూర్, గూడూరు వద్ద డిస్ట్రిబ్యూటరీ 15, ముస్తాబాద్ వద్ద డీ–18 మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రూ.12లక్షల వ్యయంతో చేసే పనులు జాప్యమయ్యాయి. నిధులు ఎప్పుడో మంజూరైనా త్వరగా మొదలు పెట్టలేదు. ఇటీవల పనులు ప్రారంభమైనా.. యాసంగి సీజన్ మొదలైంది. రైతులు ఇప్పటికే తుకాలు పోసుకున్నారు. గోపాల్‌పల్లె వద్ద కెనాల్‌పై కల్వర్టు పనులు పెండింగులో ఉన్నాయి. ముస్తాబాద్, తెర్లుమద్ది వద్ద ఆక్విడేటర్ల లీకేజీ మరమ్మతులు మొదలుపెట్టలేదు. మండలంలోని గూడూరు నుంచి తెర్లుమద్ది వరకు కెనాల్స్‌లో ఉన్న చెత్త, తుంగ, గుర్రపుడెక్కను తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు.
కెపాసిటీ : 2 టీఎంసీలు
ఆయకట్టు : 17వేల ఎకరాలు
డిస్ట్రిబ్యూటరీలు : 28
కుడి కాలువ : 32 కిలోమీటర్లు
సబ్ కెనాల్స్: 110 కిలోమీటర్లు
పనులు పూర్తయ్యేదెప్పుడో?


