ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది ఓపీవోలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల సిబ్బంది తమకు కేటా యించిన వాహనాల్లో సామగ్రితో తరలిపోయారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేకాధికారులు క్రాంతికుమార్, అఫ్జల్‌బేగం, తహసీల్దార్లు సుజాత, ముక్తార్‌పాషా, ఎంపీడీవోలు సత్తయ్య, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.
ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలి
సిరిసిల్ల: రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన శ్రీఫెర్టిలైజర్ యాప్‌శ్రీపై అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులతో మాట్లాడారు. శ్రీఫెర్టిలైజర్ యాప్‌శ్రీపై జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఈ నెల 19న శిక్షణ ఇవ్వాలన్నారు. యాప్ ఉపయోగాలను రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. యాప్‌తో రైతులకు ఎరువుల వివరాలు, ఎక్కడ అందుబాటులో ఉందో అనే సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎక్కడి నుంచి అయినా తమ పట్టాదారు పాస్ పుస్తకం వివరాలతో లాగిన్ అయితే వారికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంచాలని, లక్ష్యం మేరకు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.


