విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్‌లో ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ స ర్వేలెన్స్ బృందాలు(ఎస్‌ఎస్‌టీ), జోనల్, నోడల్ అధికారులకు గురువారం శిక్షణ ఇచ్చారు. జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు రవికుమార్, రాజ్‌కుమార్‌లతో కలిసి ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీని గుర్తించడం, ఆధారాలు సేకరించడం, రికార్డు చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. నగదు, ఇతర ఆభరణాలు సీజ్ చేసినప్పుడు వీడియో ఫుటేజీ తీసుకోవాలన్నారు. నోడల్ అధికారులు శేషాద్రి, భారతి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు.
టీ–పోల్ మొబైల్ యాప్ వినియోగించుకోవాలి
జిల్లా ప్రజలు టీ–పోల్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర గరీమా అగ్రవాల్ కోరారు. ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉన్నాయన్నారు. ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్, పోలింగ్ కేంద్రం సమాచారం, ఫిర్యాదులు చేసే అంశాలు ఉన్నాయని తెలిపారు.
పకడ్బందీగా తనిఖీ చేయాలి
రుద్రంగి(వేములవాడ): చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది పకడ్బందీగా తనిఖీలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. రుద్రంగి శివారులోని ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టును గురువారం పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్వో కేంద్రాన్ని తనిఖీ చేశారు. నోటీసుబోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా.. లేదా.. అని తనిఖీ చేశారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.


