సరిహద్దుల్లో పటిష్ట నిఘా
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులు
సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి/బోయినపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. బోయినపల్లి మండలం నర్సింగపూర్, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారు చెక్ పోస్టులను గురువారం తనిఖీ చేశారు. జిల్లాలోని తంగళ్లపల్లి(జిల్లెళ్ల), గంభీరావుపేట(పెద్దమ్మ), ముస్తాబాద్(వెంకట్రావుపల్లి), వేములవాడరూరల్(ఫాజుల్‌నగర్), బోయినపల్లి(నర్సింగపూర్), రుద్రంగి(మనాల క్రాస్‌రోడ్) మండలాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్ ఉన్నారు.
ఎన్నికలకు పటిష్ట భద్రత
గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రత చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు కొత్తగా విధుల్లో చేరిన వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లను అధికారులు తరచూ సందర్శించాలని తెలిపారు. రౌడీషీటర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. సోషల్‌మీడియాలో విద్వేషాలు కలిగేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్ట్‌లు పెడితే చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్ చేసిన వారితోపాటు గ్రూప్ అడ్మిన్లపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఇన్‌స్పెక్టర్లు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


