పట్టాల పండుగ!
న్యూస్‌రీల్
శాతవాహన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్ పమేలా సత్పతి
బందోబస్తును స్వయంగా పరిశీలించిన సీపీ గౌస్ ఆలం
నిరసనలకు బీసీ, విద్యార్థి సంఘాల ప్రణాళికలు
శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఇయ్యాల్నే
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్‌కు రానున్నారు. శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు జిల్లా యంత్రాంగం, వర్సిటీ సిబ్బంది ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి గవర్నర్ శుక్రవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి 10.50 గంటలకు శాతవాహన వర్సిటీకి చేరుకుంటారు. అక్కడ స్నాతకోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పలువురికి పీహెచ్‌డీలు ప్రదానంచేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడ హస్తకళలు, ఫిలిగ్రీ కళారూపాలు, పలు స్టాళ్లను పరిశీలిస్తారు. కలెక్టర్‌తో సమావేశమవుతారు. జిల్లా ప్రగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. అనంతరం జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు ప్రముఖులతో గవర్నర్ భేటీ అవుతారు. మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.
ఏర్పాట్లు పూర్తి..
గవర్నర్ పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గురువారం శాతవాహన యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏసీపీలు వెంకటరమణ, విజయ్‌కుమార్, పలువురు సీఐలు, ఎస్సైలతో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాంటీ సాబాటేజ్ చెకింగ్స్ నిర్వహిస్తున్నామన్నారు. కీలక ప్రాంతాలలో శాశ్వత భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. భద్రతా వలయాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రోప్ పార్టీలు ఏర్పాటు చేశామని వివరించారు.
మీడియా వెళ్లిపోవాలి: వీసీ ఉమేశ్..
అంతకుముందు వీసీ ఉమేశ్‌కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి స్నాతకోత్సవం, గవర్నర్ పర్యటన వివరాలు వెల్లడించారు. కవరేజీ, మీడియా పాసుల విషయంలో వర్సిటీ అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం గందరగోళానికి దారితీసింది. ‘మీడియాను వెళ్లిపోండి’ అంటూ వీసీ ఉమేశ్ అనడంతో పలువురు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. వీసీ ఉమేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
పర్యటనను అడ్డుకునేందుకు..
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు బీసీ సంఘాల నేతలు గవర్నర్ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ధర్నా చేసేందుకు రెడీఅయ్యారు. కాగా.. నిరసన వ్యక్తం చేయానుకునేవారిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
పట్టాల పండుగ!
పట్టాల పండుగ!
పట్టాల పండుగ!


