కదలని ధాన్యం.. రైతుల దైన్యం
కాంటా పెట్టి ఆరు రోజులైంది
● కొర్రీలు పెడుతున్న నిర్వాహకులు ● తేమశాతం పేరుతో తూకంలో కోత ● జిల్లాలో 3.65 లక్షల టన్నుల దిగుబడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వరి పంట చేతికొచ్చిన నాటినుంచి వరుణుడి ప్రకోపం రైతుల ఆశలపై నీళ్లుతోంది. వెంటాడుతున్న వర్షం మిల్లర్లకు వరంగా మారుతోంది. కల్లాల్లో ధాన్యం కాంటాకు కదలకపోతుండగా.. తేమశాతం పేరిట నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. సీజన్‌లో 3.65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా, 15 రోజుల్లో సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.
వెంటాడుతున్న వరుణుడు..
జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనారావుపేట, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట తదితర మండలాల్లో రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తూ భయపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంను చూపుతూ తమ ఇబ్బందులను వివరిస్తున్నారు. మిల్లర్లు తూకం వేసిన ధాన్యం బస్తాలను దింపుకోక పోవడంతో నిరాశ చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభ దశలో నాయకులు, అధికారులు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేమశాతం పేరుతో కొర్రీలు
వర్షంతో ధాన్యం తడవడం, మల్లీ ఆరబెట్టడం చేసినప్పటికీ అదనపు ధాన్యం తూకం వేసి ఇచ్చినా మిల్లర్లు మరింత కోతపెడతామని చెప్పుతూ, తిప్పి పంపే యత్నం చేస్తూనే ఉన్నారు. ఈ విసయమై అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా స్పందన లేక పోవడంతో రైతులే స్వయంగా రోడ్డెక్కి నిరసన తెలిపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా వెంకటాపూర్ కొనుగోలు కేంద్రం తూకం వేసిన ధాన్యాన్ని ఆరు రోజులు కేంద్రంలోనే ఉంచారు. మిల్లుకు తరలిస్తే తేమ శాతం పేరుతో ధాన్యంను దింపుకోకుండా మిల్లర్లు తిప్పి పంపారు. లోడ్ లారీని రైతులు కలెక్టరేట్‌కు తరలిస్తుండగా, పోలీసులు అడ్డుకుని తిరిగి కేంద్రానికి తరలించారు.
ఈ చిత్రం వెంకటాపూర్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం. రైతులు పండించిన ధాన్యాన్ని ఈ కేంద్రానికి తీసుకొచ్చారు. మద్దతు ధర వస్తుందనే ఆశతో నెల రోజులుగా ధాన్యం ఆరబెడుతున్నారు. అయినా తూకం వేయడం లేదు. నిర్వాహకులు తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టడంతో ఇబ్బంది పడుతున్నారు.
15 రోజుల క్రితం వడ్లను కేంద్రనికి తీసుకువచ్చాం. పది రోజుల నుంచి వడ్లు కొంటున్నారు. మ్యాచర్ వచ్చిందని నాకు సంబంధించిన 400 బస్తాలు కాంటా పెట్టిండ్రు. కాంట పెట్టి ఆరు రోజులు గడిచిన మిల్లుకు తరలిస్తలేరు. తర్వాత పంపిస్తే మ్యాచర్ పెరిగిందని మిల్లర్లు వాపసు పంపిస్తున్నారు. – దుగ్గు బాలకిషన్, రైతు, వెంకటాపూర్
కదలని ధాన్యం.. రైతుల దైన్యం
కదలని ధాన్యం.. రైతుల దైన్యం


