పరిహారం ఇవ్వాలని ఆందోళన
● వేములవాడలో రైల్వేలైన్ నిర్వాసితుల ఆందోళన
వేములవాడ: రైల్వేలైన్ కోసం సేకరించనున్న భూములకు వెంటనే పరిహారం ఇవ్వాలని, లేదంటే ఆ భూములను గెజిట్ నుంచి తొలగించి అమ్ముకునేందుకు అవకాశమివ్వాలని రైల్వేలైన్ నిర్వాసితులు కోరారు. గురువారం వారు వేములవాడలో ఆందోళనకు దిగారు. చాలారోజుల క్రితమే రైల్వేలైన్ కోసం తమ భూములను గెజిట్‌లో చేర్చారని, అయితే వాటికి సంబంధించి ఇప్పటివరకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. వెంటనే తమకు పరిహారం ఇప్పించాలని, లేకపోతే భూములను గెజిట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, మారం కుమార్, జడల శ్రీనివాస్, కూరగాయల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


