పట్టాలొచ్చినా.. పైసలివ్వరా? | - | Sakshi
Sakshi News home page

పట్టాలొచ్చినా.. పైసలివ్వరా?

Nov 6 2025 8:30 AM | Updated on Nov 6 2025 8:30 AM

పట్టాలొచ్చినా.. పైసలివ్వరా?

పట్టాలొచ్చినా.. పైసలివ్వరా?

సర్కారు నుంచి విడుదల కాని బకాయిలు

ఫీజులు చెల్లించలేక శాతవాహనలో నిలిచిన టీసీలు

టీసీలివ్వకపోతే సీటు క్యాన్సిల్‌ చేస్తామంటున్న కొత్త కాలేజీలు

ఉన్నత విద్యకు వెళ్లేందుకు పేద, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కష్టాలు

ఉమ్మడి జిల్లాలో రూ.200 కోట్లవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

వారంతా పట్టాలు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్లు. కూలీనాలీ చేసుకుని బతికే ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీటు సాధించారు. రాత్రీ పగలు చదివి మరో చోట బీఈడీలో సీటు పొందారు. తీరా సీటు వచ్చినా చేరలేని దయనీయ స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాకపోయేసరికి ఇప్పుడు వీరికొచ్చిన బీఈడీ సీట్లు ప్రమాదంలో పడ్డాయి. మరో వారం రోజుల్లో సొంతంగా ఫీజు చెల్లించి టీసీలు తీసుకుని, కొత్త కళాశాలల్లో అప్పగిస్తేనే సీట్లు దక్కుతాయి. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వీరి ఆర్థిక నేపథ్యం అంతంతే. ఒక్కో విద్యార్థి కనీసం రూ.50వేల చొప్పున చెల్లించాలని కళాశాలనుంచి ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు రూ. 200 కోట్ల బకాయిలు

మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం (సుప్మా) ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ సోమవారం నుంచి నిరవధిక బంద్‌ పాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25వేల మంది విద్యార్థులు ఆయా కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.200కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, త్వరగా విడుదల చేయాలని కళాశాలల నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా విద్యార్థులకు ఎంటీఎఫ్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి గత 18 నెలలుగా రకరకాల మార్గాల ద్వారా ఆవేదనను, ఆర్థిక పరిస్థితిని తెలియజేసినా ఎలాంటి స్పందన లేని కారణంగా డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్‌ పిలుపుమేరకు నిరవధిక బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement