ఫోరెన్సిక్ ఆడిట్!
శాసీ్త్రయంగా విచారణ
సర్వే నంబర్లు.. మండలాల వారీగా రైతులు
భూబదలాయింపులపై విచారణ
కేరళ ఏజెన్సీతో ఆడిట్
రాష్ట్రంలోనే తొలిసారి విచారణ పర్వం
91,416 సర్వేనంబర్లు.. 4,68,532 ఎకరాలు
ఇదీ.. 2024 డిసెంబరులో జిల్లా అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అప్పటి ఎస్పీ అఖిల్ మహాజన్‌లకు భూమి పట్టా పత్రం అందిస్తున్న మహిళ మిట్టపల్లి పద్మ.ఈమె తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్. ఆమె పేరిట 2018లో తాడూరు శివారులోని సర్వే నంబర్ 545/1/1/3/1లో రెండెకరాల ప్రభుత్వ భూమికి పట్టాపొందారు. తనకు కేటాయించిన ఆ రెండు ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ఇలా జిల్లాలోని ప్రభుత్వ భూములను గుట్టుగా పట్టాలు పొందిన వారు తరువాత కలెక్టర్ నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసు కేసులకు భయపడి తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. ఇలాంటి రెవె‘నూ’ ఆక్రమణలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరిగాయి.
ఇది చందుర్తి మండలం మల్యాలలోని పట్టాభూమి. ఈ భూమిని పట్టాదారుడికి తెలియకుండానే ధరణి వచ్చిన తొలిరోజుల్లో మరొకరి పేరిట బదలాయించి రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకున్నారు. చందుర్తి, లింగంపేట, మల్యాల శివారుల్లో ఇలాంటి ఆక్రమణలు చాలా జరిగాయి. రెవెన్యూ రికార్డులను మార్పిడి చేసిన ఘటనలో పోలీసులు ఓ తహసీల్దార్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. చందుర్తి మండలంలో ధరణి పోర్టల్ వచ్చినప్పుడు విధుల్లో ఉన్న తహసీల్దార్ భారీగా ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోనిని సర్వేనంబర్ 119/13, 119/39, 119/40లో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇలా ఇటీవల బోర్డు ఏర్పాటు చేశారు. నిజానికి ఇక్కడ ఇదే సర్వేనంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఓ కులసంఘం పేరిట ఐదెకరాలను ధరణి పోర్టల్ వచ్చిన తొలినాళ్లలో అక్రమంగా పట్టా ఇచ్చారు. ఈ పట్టా జారీ వెనుక భారీగా డబ్బులు చేతులు మారినట్లు అధికారుల విచారణ తేలింది. దీంతో ఇలా బోర్డు ఏర్పాటు చేశారు.
సిరిసిల్ల: జిల్లాలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం నుంచి భూభారతి వరకు జరిగిన భూలావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూరికార్డుల మార్పిడిపై పైలట్ ప్రాజెక్టుగా రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టారు. కేరళకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్(కేఎస్‌ఏఏసీ)కు ఈ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రం ఏర్పాటైన నాటికి ఉన్న భూరికార్డులు, ప్రక్షాళన జరిగిన తరువాత అమలులోకి వచ్చిన భూరికార్డులు, ధరణిలో నమోదు అంశాలను ఆ సంస్థ పరిశీలించనుంది. భూరికార్డుల ప్రక్షాళన ఆధారంగా జరిగిన లావాదేవీలు, యాజమాన్య హక్కుల బదిలీలు, ‘ధరణి’ పోర్టల్‌లో లావాదేవీలు, నిర్వహించిన సమయం, నిషేధిత జాబితా నుంచి ఎత్తివేస్తూ.. సర్వేనంబర్లు, భూముల బదలాయింపులపై డిజిటల్ పోస్టుమార్టం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, భూదాన్, అసైన్డ్, సీలింగ్, అటవీ, వక్ఫ్, ఇనాం భూముల మార్పిడిపై ఆడిటింగ్ చేస్తున్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని నిర్ధిష్ట గడువుతో ముందుకెళ్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ కేంద్రంగా సీసీఎల్‌ఏలో ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుగుతోంది.
జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు ఉండగా.. 260 గ్రామపంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 91,416 సర్వేనంబర్ల పరిధిలో 4,68,532 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించిన ‘ధరణి’ రికార్డులు, అంతకుముందు ఉన్న పహణీలు, వన్–బీ రికార్డులు, రైతుల వారీ ఖాతాలను శాసీ్త్రయంగా విచారణ చేపడుతన్నారు. డిజిటల్ ఆడిటింగ్ తర్వాత అవసరమైన సమాచారం కోసం సదరు సంస్థ ప్రతినిధులు జిల్లాలోని మ్యానువల్ రికార్డులను పరిశీలించనున్నారు. వారికి అవసరమైన సమాచారం, రికార్డులను అందుబాటులో ఉన్న వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు అందిస్తామని జిల్లాలోని ఓ రెవెన్యూ అధికారి ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ రికార్డులను ‘ధరణి’ పోర్టల్ వేదికగా శాసీ్త్రయంగా డిజిటల్ ఆడిటింగ్ చేయడం విశేషం.
మండలం సర్వే నంబర్లు రైతులు
సిరిసిల్ల 2,565 3,287
తంగళ్లపల్లి 9,107 10,387
గంభీరావుపేట 9,423 9,691
ముస్తాబాద్ 9,633 11,192
ఎల్లారెడ్డిపేట 11,753 9,782
వీర్నపల్లి 1,148 3,018
వేములవాడ అర్బన్ 4,950 5,039
వేములవాడ రూరల్ 6,081 6,415
బోయినపల్లి 8,692 9,013
కోనరావుపేట 8,539 9,867
చందుర్తి 6,367 8,110
రుద్రంగి 1,247 2,751
మొత్తం 91,416 1,03,140
ఫోరెన్సిక్ ఆడిట్!
ఫోరెన్సిక్ ఆడిట్!


