రుణాల రికవరీలో ముందుండాలి
● పేద మహిళలందరూ సంఘాల్లో ఉండాలి ● సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్
సిరిసిల్ల: రుణాల రికవరీలో రాష్ట్రంలోనే జిల్లా ముందుండాలని, జిల్లాలోని ప్రతీ పేద మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. జిల్లాలోని సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి గురువారం సమీక్షించారు. దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఇందిరా మహిళాశక్తి కింద పేద మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదిగేలా మద్దతు ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో ఎస్‌హెచ్‌జీలకు భవనాలు ఉండాలని, సభ్యులందరూ అక్షరా భ్యాసం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్, సోలార్ పవర్ యూనిట్, మండలానికి ఒక ఆర్టీసీ బస్సు ఇప్పించేలా ముందుకెళ్లాలని ఆదేశించారు. పేద గర్భిణీలు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని పోషకాహారం అందించాలని కోరారు. రానున్న ఉగాదిలోగా జిల్లాలోని మహిళలందరూ కనీసం చదువుకునేలా తీర్చిదిద్దాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలకు 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు. పేద ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్లు ఇచ్చామన్నారు. వీవో బిల్డింగ్స్ నిర్మాణానికి కృషి చేస్తామని, పెట్రోల్‌బంక్, సోలార్ పవర్ యూనిట్ ఇతర పనులు పూర్తి చేస్తామని వివరించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ‘గుప్పెడు బియ్యం.. గుప్పెడు పప్పు’లో భాగంగా పేద మహిళలకు పౌష్టికాహారం అందించారు. అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌డీవో శేషాద్రి, అడిషనల్ డీఆర్‌డీవో శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య పాల్గొన్నారు.
అతివలు మురిసేలా చీరలు ఉండాలి
అతివలు మురిసేలా ఇందిరా మహిళాశక్తి చీరలు నాణ్యత.. నవ్యతతో ఉండాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో మరమగ్గాలపై ఉత్పత్తి అవుతున్న ఇందిరా మహిళాశక్తి చీరలను పరిశీలించారు. దివ్య దేవరాజన్ మాట్లాడుతూ నాణ్యమైన చీరలను అందించడమే తమ లక్ష్యమని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. మొదటి విడత చీరల ఆర్డర్లు ముగింపు దశకు చేరాయని, రెండో విడత డిజైన్లలో మార్పులు చేయకుండా ఆర్డర్లు ఇవ్వాలని వస్త్రోత్పత్తిదారులు కోరారు. చేనేత, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.వెంకటేశ్వర్‌రావు, ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారుల ప్రతినిధులు ఆడెపు భాస్కర్, గోవిందు రవి, తాటిపాముల దామోదర్, డీఆర్‌డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


