
ప్రయాణ భారం
గంటల తరబడి ఆలస్యం వంతెన లేక ఇబ్బంది పట్టింపులేని అధికార గణం సిద్దిపేట–కామారెడ్డి రూట్లో ప్రయాణికులకు తప్పని తిప్పలు
ముస్తాబాద్(సిరిసిల్ల): కామారెడ్డి–సిద్దిపేట మధ్య ప్రయాణించేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రెండు పట్టణాల మధ్య గల వాగులపై సరైన వంతెనలు లేక ప్రయాణం భారంగా మారింది. రెండు గంటలకు ఒక బస్ కూడా నడవకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికంతటికి కారణం.. గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన లేకపోవడం, వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి కామారెడ్డి, సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న లింగన్నపేట వంతెన కొట్టుకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు.
మూడేళ్లుగా ప్రయాణ కష్టాలు..
గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య ఎగువ మానేరు వాగుపై నిజం కాలంలో కాజ్‌వే నిర్మించారు. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో క్యాజ్‌వేను కూల్చి ప్రత్యామ్నాయంగా వాగులో మట్టి రోడ్డు వేశారు. ఎందుకనో వంతెన పనులు నిలిచిపోగా, మూడేళ్లుగా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే మానేరు వాగులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడం రివాజుగా మారింది. ఈఏడాదిలో ఇప్పటికే మూడు నెలలుగా ఈ రూట్‌లో ప్రయాణాలు బంద్ అయ్యాయి. ఆర్టీసీ బస్‌లు, ప్రైవేటు వాహనాలు ఈ రూట్‌లో నడపడం బంద్ చేశారు. దీంతో ఈ రూట్‌లో నడిచే సిద్దిపేట ఆర్టీసీ బస్‌లను సగానికిపైగా కుదించారు. రెండు గంటలకొక బస్ నడుపుతున్నారు. అది కూడా సిద్దిపేట నుంచి కామారెడ్డికి వెళ్లే రూటును మల్లారెడ్డిపేట మీదుగా గంభీరావుపేటకు మళ్లించారు. నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు కింద కూడా వంతెనలపై నీరు వెళ్లడంతో ఆ రూట్‌ను రెండు నెలలుగా మూసివేశారు. దీంతో ముస్తాబాద్, సిద్దిపేట, నా మాపూర్, చిప్పలపల్లి, బందనకల్, కామారెడ్డి, గంభీరావుపేట మండలాల ప్రజలు దూర భారంతో ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయానికి బస్‌లు నడవక, అటోల్లో వెళ్తే అధిక చార్జీల బారిన పడుతున్నారు. ముస్తాబాద్ ప్రయాణికులు కామారెడ్డి వెళ్లాలంటే మల్లారెడ్డిపేట మీదుగా తిరిగి వెళ్లాలి. దీనికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక లింగన్నపేట, గంభీరావుపేట ప్రజలు అటు నుంచి ఇటు రావాలన్న.. ఇటు నుంచి అటు వెళ్లాలన్న 15 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాలి. ప్రతీ ప్రయాణికుడు రూ.20 అదనంగా చార్జీ భరించాల్సి వస్తోంది.

ప్రయాణ భారం

ప్రయాణ భారం