కదనరంగంలో కరీంనగర్‌.. | - | Sakshi
Sakshi News home page

కదనరంగంలో కరీంనగర్‌..

Sep 17 2025 7:47 AM | Updated on Sep 17 2025 7:53 AM

కదనరంగంలో కరీంనగర్‌..

కరీంనగర్‌: నిజాం పాలన అంతం కోసం తొలిదళాన్ని ఏర్పాటు చేసి సాయుధ పోరులో హతమైన తొలి దళనాయకుడు అనభేరి ప్రభాకర్‌రావు తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన వారు. అలాగే చెన్నమనేని రాజేశ్వర్‌రావు, గట్టెపల్లి మురళీధర్‌రావు, చామనపల్లి చొక్కారావు, ఖాసీంపేట వెంకట్‌రెడ్డి, బొజ్జపురి వెంకటయ్య, వేముల నర్సింహులు, గాంభీరపు రామయ్య లాంటి ఎందరో అరాచక పాలనకు ఎదురుతిరిగారు.

రణభేరి మోగించిన ‘అనభేరి’

జమీందారి కుటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకర్‌రావు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి దళ నాయకునిగా తుపాకి పట్టి పేదలకు బాసటగా నిలిచారు. 1910 ఆగస్టు 15న తిమ్మాపూర్‌ మండలం పొలంపెల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యను మచిలీపట్నం, ఉన్నత విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. తెలంగాణ విముక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన తొలి సాయుధ దళ నాయకునిగా చరిత్రకెక్కారు. 1948 మార్చి 14న ప్రభాకర్‌ సాయుధ దళాన్ని హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ పోలీస్‌ పటేల్‌ భోజనానికి పిలిచి ఆ సమాచారాన్ని నిజాం ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో మహ్మదాపూర్‌ గుట్టలను మిలటరీ, రజాకార్లు చుట్టుముట్టారు. వారి తూటాలకు ఎదురొడ్డి పోరాడి ‘అనభేరి’తో పాటు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అయిరెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి.దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్గొండ రాజరాం, చిక్కుడు సాయిలు, రోండ్ల మాధవరెడ్డి అమరులయ్యారు.

కొరియర్‌గా చిన్నమల్లయ్య

తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పాల్గొన్న దేశిని చిన్నమల్ల య్య మలి విడత తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలంగా వ్యవహరించారు. 1948 ఫిబ్రవరిలో అనభేరి ప్రభాకరరావును కలిసి ఆయన దళానికి కొరియర్‌గా పని చేశారు. తర్వాత ప్రజాజీవితంలో నాలుగుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి సమితి ప్రెసిడెంట్‌గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. నిర్వర్తించారు.

విద్యార్థిగా ఉద్యమంలో..

విద్యార్థి దశలోనే జువ్వాడి గౌతంరావు స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు. కరీంనగర్‌, వరంగల్‌ జైళ్లలో శిక్ష అనుభవించారు. 1947లో ఔరంగాబాద్‌ జైలు నుంచి తప్పించుకొని మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి లాంటి వీరుల మార్గదర్శకత్వంలో పనిచేశారు.

అజ్ఞాత జీవితం తప్పలేదు

బోయినిపల్లి వెంకటరామరావు 1947 అక్టోబర్‌ 2న అనేక గ్రామాల్ల్లో గాంధీజయంతి వేడుకలు జరిపారు. జాతీయ పతా కాలను ఆవిష్కరించారు. సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని ప్రచారం చేశారు. నిజాం పోలీసులు, రజాకార్లు తోటపెల్లిలో ని ఆయన ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు.

ఉద్యమకారులకు కొరియర్‌గా

జిల్లాకు చెందిన వెలిచాల కొండల్‌రావు హైదరాబాద్‌లో చదువుకుంటూనే విద్యార్థి కార్యకర్తగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల వయసులో కోర్టు విచారణలో మెజిస్ట్రేట్‌కే ఎదురు తిరిగినందుకు 7 రోజుల జైలు శిక్ష గడపాల్సివచ్చింది. చదువుకుంటూనే నాయకులకు కోరియర్‌గా గా పని చేశారు.

పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ధీశాలి..

మహదేవ్‌పూర్‌కు చెందిన ఎస్‌.శంకరయ్య 1947లో ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. అప్పట్లో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఎస్సై గురుదయాళ్‌ సింగ్‌ వీరిని అరెస్ట్‌ చేశారు. మంథని వీధుల్లో లాఠీ దెబ్బలు కొడుతూ ఊరేగించారు. అనంతరం శంకరయ్య తప్పించుకుని చాందా క్యాంపులో చేరారు. తర్వాత మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌గా భావించి కాళేశ్వరం ఔట్‌పోస్ట్‌పై దాడి చేశారు.

కదనరంగంలో కరీంనగర్‌..
1
1/4

కదనరంగంలో కరీంనగర్‌..

కదనరంగంలో కరీంనగర్‌..
2
2/4

కదనరంగంలో కరీంనగర్‌..

కదనరంగంలో కరీంనగర్‌..
3
3/4

కదనరంగంలో కరీంనగర్‌..

కదనరంగంలో కరీంనగర్‌..
4
4/4

కదనరంగంలో కరీంనగర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement