
కుటుంబ కలహాలతోనే గృహిణి హత్య
● నిందితుడి అరెస్ట్ ● బైక్, కత్తి స్వాధీనం ● డీసీపీ కరుణాకర్ వెల్లడి
గోదావరిఖని: కుటుంబ కలహాలతోనే రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధి వకీల్‌పల్లి ప్లాట్స్‌లో ఆదివారం మేడి రమాదేవి హత్య జరిగిందని డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేశ్ తెలిపారు. గోదావరిఖని వన్‌టౌన్‌లో మంగళశారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన మేడి రమాదేవి ఉరఫ్ పూసల ప్రశాంతి, జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పూసల కృపాకర్ ఉరఫ్ ప్రభాకర్ 13ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పన్నూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం తన భర్త ఇంటికి రమాదేవి చేరుకుంది. ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వావాదం జరిగింది. నిత్యం జరిగే వివాదాల నేపథ్యంలో రమాదేవిని ఎలాగైనా చంపాలని నిర్ణయించి కృపాకర్.. కత్తితో తల, మెడ, కడుపులో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హత్య తర్వాత బైక్‌పై నిందితుడు పరారయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం ఉదయం అద్నాపూర్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. హీరోహోండా బైక్, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో మృతిరాలి అత్తామామలను త్వరలో అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రామగిరి ఎస్సైలు శ్రీనివాస్, దివ్య పాల్గొన్నారు.

కుటుంబ కలహాలతోనే గృహిణి హత్య